సినిమా తారలకు సంబంధించిన విషయాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘ఇదిగో తోక అంటే అదిగో పులి’ అనేంతలా పరిస్థితులు మారాయి. నటీనటుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. ఆ వార్తలో నిజం ఉందో లేదో అని కూడా పట్టించుకోకుండా నెటిజన్లు లైక్‌లు, షేర్లు చేస్తూ మరింత వైరల్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ సందడి చేస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారహో అంటూ పోస్ట్ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ, రష్మికలు కలిసి ఇప్పటి వరకు రెండు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. దీంతో వీరి మధ్య ఏదో ఉందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై అటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం వీరిని ఇప్పటికే ఓ ఇంటి వాళ్లను చేసేశారు. రష్మిక, విజయ్‌లు వరమాలతో ఉన్నట్లు ఓ ఫొటోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్లిద్దరికి ఎప్పుడు పెళ్లి అయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారన్న వార్తలకు వీరి వ్యవహార శైలి కూడా బలం చేకూర్చినట్లైంది. మొన్నటి మొన్న వీరిద్దరు కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకే సమయంలో ముంబై ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన ఈ జంట తెగ సందడి చేసింది. ప్రస్తుతం ఈ జంట వారి వారి చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తుండగా, విజయ్ తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..