Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2021: సినిమా ఇండస్ట్రీని వీడని విషాదాలు.. 2021లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే..

కాలచక్రం గిర్రున తిరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది కూడా ముగియనుంది. కరోనా ప్రభావంతో గతేడాది లాగే ఈ ఏడాది కూడా చాలామందికి కఠినంగా గడిచింది

Year Ender 2021: సినిమా ఇండస్ట్రీని వీడని విషాదాలు.. 2021లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2021 | 6:05 AM

కాలచక్రం గిర్రున తిరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది కూడా ముగియనుంది. కరోనా ప్రభావంతో గతేడాది లాగే ఈ ఏడాది కూడా చాలామందికి కఠినంగా గడిచింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. సెకండ్‌ వేవ్‌లో సినిమా థియేటర్లు మళ్లీ మూతపడడంతో సినీ కార్మికులు రోడ్డున పడాల్సివచ్చింది. ఈక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు తీసిన కరోనా.. కొందరు సినీ ప్రముఖులను కూడా బలి తీసుకుంది. అనారోగ్య కారణాలు, ప్రమాదాల బారిన పడి మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అలా ఈ ఏడాది మనకు దూరమైన వారిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, శివశంకర్‌ మాస్టర్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, వివేక్‌ లాంటి ప్రముఖులు ఉన్నారు. మరికొన్ని రోజుల్లో 2021 ముగియనున్న తరుణంలో ఈ ఏడాది ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్న కొందరు ప్రముఖులను గుర్తుచేసుకుందాం రండి.

Siri Vennela

Siri Vennela

సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) తెలుగు సినిమా పరిశ్రమలో ఈ ఏడాది ఇదే అతి పెద్ద విషాదం. వేలాది సినిమా పాటలకు సాహిత్యం అందించిన సాహితీ దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్‌ 30న తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియా కారణంగా నవంబర్‌24న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు వైద్యులు. అయితే రెండు ఊపిరితిత్తులు బాగాదెబ్బతినడంతో కోలుకోలేక శాశ్వతంగా కన్నుమూశారు. ఆరేళ్ల క్రితమే ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడ్డారు సిరివెన్నెల. దీంతో అప్పట్లోనే వైద్యులు రెండు ఊపిరితిత్తుల్లో ఒకదాన్ని తొలగించారు. అయితే ఇటీవల రెండో ఊపిరితిత్తికీ కూడా కేన్సర్‌ సోకింది. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన ఆయనను 5 రోజుల పాటు ఎక్మోపై ఉంచి చికిత్స అందజేశారు. కానీ కోలుకోలేక తుది శ్వాస విడిచారు.

Shiva Sankar Master

Shiva Sankar Master

శివ శంకర్‌ మాస్టర్‌ (72) ‘ధీర ధీర’ అంటూ ‘మగధీర’ సినిమాకు అద్భుతమైన నృత్య రీతులు సమకూర్చి జాతీయ అవార్డు అందుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివ్‌శంకర్‌ మాస్టర్‌. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చెన్నైలో పుట్టి పెరిగారు. సలీమ్‌ మాస్టర్‌ దగ్గర శిష్యరికం చేశారు. 800 చిత్రాలకు పైగా డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారు. నటునిగానూ ఎన్నో చిత్రాల్లోనూ మెరిశారు. కొన్ని టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఈ మల్టీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌ నవంబర్‌ 28న శాశ్వతంగా ఈలోకం నుంచి సెలవు తీసుకున్నారు.

Puneeth Rajkumar

Puneeth Rajkumar

పునీత్‌ రాజ్‌కుమార్(46) ఈ ఏడాది భారతీయ సినిమా పరిశ్రమను బాగా కుదిపేసిన విషాద ఘటనల్లో ఇది ఒకటి. సినిమా రంగంలో ఎంతో భవిష్యత్‌ ఉన్న కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంతో కర్ణాటక చిత్ర పరిశ్రమనే కాదు యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ అభిమానులు ‘అప్పు’ అని ముద్దుగా పిలుచుకునే ఈ యంగ్‌ హీరో మన మధ్య లేడంటే ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు.

Thummala Narsimha Reddy

Thummala Narsimha Reddy

టీఎన్‌ఆర్‌ (44) ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకున్నారు తుమ్మల నరసింహారెడ్డి (టీఎన్‌ఆర్‌). కొన్ని ఛానెళ్లో యాంకర్‌గా పనిచేశారు. నటునిగా పలు సినిమాల్లో కూడా మెరిశారు . ఇలా బహుముఖ ప్రజ్ఞ చూపిన టీఎన్‌ఆర్‌ కరోనా బారిన పడి మే10న కన్నుమూశారు.

Sidharth Shukla

Sidharth Shukla

సిద్ధార్థ్‌ శుక్లా (40) ఈ ఏడాది బాలీవుడ్‌ను బాగా కుదిపేసిన విషాద ఘటనల్లో సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణం ఒకటి. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఇతను ‘బాలికా వధు’ (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత బిగ్‌ బాస్‌-13 సీజన్‌ టైటిల్‌ విజేత నిలిచి తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లోనూ, వెబ్‌ సిరీసుల్లోనూ నటించి మెప్పించాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఉజ్వల కెరీర్‌ సొంతం చేసుకోవాల్సిన ఈ యువ నటుడు నాలుగు పదుల వయసులోనే గుండెపోటుతో కన్నుమూశాడు.

Mahesh S. Koneru

Mahesh S. Koneru

మహేశ్‌ కోనేరు (40) ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌ ను స్థాపించి ‘118’, ‘తిమ్మరుసు’, ‘మిస్‌ ఇండియా’ తదితర చిత్రాలను నిర్మించారు మహేశ్‌ కోనేరు. విజయ్‌ ‘బిగిల్‌’ను తెలుగులో ‘విజిల్‌’గా డబ్‌ చేసి మంచి విజయం అందుకున్నారు. అంతకుముందు నటులు ఎన్టీఆర్‌చ కల్యాణ్‌రామ్‌లకు వ్యక్తిగత పీఆర్‌గా పనిచేసిన ఆయన అక్టోబర్‌ 12న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

Jayanthi

Jayanthi

జయంతి (76) సినిమా పరిశ్రమలో ‘అభినయ శారద’గా గుర్తింపు పొందారు ప్రముఖ నటి జయంతి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి సీనియర్‌ నటులతోనూ స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారామె. 500కు పైగా సినిమాల్లో నటించిన ఆమె.. ‘పెదరాయుడు’ చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా శ్వాసకోస సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈఏడాది జులై 26న కన్నుమూశారు.

Vivek

Vivek

వివేక్‌(60) తమిళ సినిమా ఇండస్ట్రీలో వడివేలు తర్వాత హాస్యనటుడిగా ఆ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు వివేక్‌. 240కు పైగా ఆయన సినిమాల్లో నటించారు. డబ్బింగ్‌ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకలను కడుపుబ్బా నవ్వించారు. ‘అపరిచితుడు’ లో విక్రమ్‌ స్నేహితుడిగా, ‘శివాజీ’లో రజనీతో, ‘రఘు వరన్‌ బీటెక్‌’ ధనుష్‌ సహోద్యోగిగా నటించి మెప్పించారు. ఇక మరో కోలీవుడ్‌ హీరో సూర్యతో కలిసి ‘సింగం’ లో వివేక్‌ చేసిన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ఇలా తనదైన నటనతో మన ముఖాల్లో నవ్వులు పూయించిన ఆయన ఏప్రిల్‌ 17న అందరినీ శోకసంద్రంలో ముంచారు. గుండెపోటుతో ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక కన్నుమూశారు.

B.a. Raju

B.a. Raju

బీఏ రాజు (62) టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత బీఏ రాజు మే 22న గుండె పోటుతో మృతి చెందారు. సినిమా జ‌ర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన స్టార్‌ నటులకు పీఆర్వోగా వ్యవహరించారు. ‘సూపర్‌హిట్‌’ అనే సినీ పత్రికను కూడా నిర్వహించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి హిట్‌ పలు సినిమాలను తెరకెక్కించారు. ‘చంటిగాడు’, ‘ ప్రేమికులు’, ‘గుండమ్మ గారి మనవడు’, ‘లవ్లీ’, ‘ సవాల్’, ‘వైశాఖం’ వంట చిత్రాలు బీఏ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కినవే.

వీరితో పాటు ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ (45), దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కే.వీ. ఆనంద్‌(54), నిర్మాత ఆర్‌.ఆర్‌. వెంకట్(57), గేయ రచయిత వెన్నెలకంటి (64) తదితర ప్రముఖులు కూడా ఈ ఏడాది మన నుంచి దూరమయ్యారు.