Nithin 30 Release Date Announced: ‘శ్రీనివాస కళ్యాణం’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకొని ఫుల్ జోష్ మీదున్నాడు యంగ్ హీరో నితిన్. ఇక గతేడాది వివాహం చేసుకొని బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.
ఇప్పటికే నితిన్ నటిస్తోన్న ‘చెక్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. చెస్ ప్లేయర్‌గా నటిస్తోన్న నితిన్ ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మూడు సినిమాలను ఒకేసారి తెరకెక్కించే పనిలో ఉన్నాడీ యంగ్ హీరో. వీటిలో హిందీ సినిమా రీమేక్ ‘అంధాదున్’ ఒకటి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్‌తో పాటు తమన్నా కీలకపాత్ర పోషిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా తేదీని ప్రకటించింది. ఇంత వరకు పెద్దగా వార్తల్లోలేని ఈ సినిమా నేరుగా విడుదల తేదీని ప్రకటించడం విశేషం. నితిన్ పియానో ప్లే చేస్తున్న లుక్‌తో కూడిన ఫొటోతో పాటు సినిమాను జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లో 30వ చిత్రంగా రానుంది. ఇక చెక్, అంధాదున్ రీమేక్‌తో పాటు.. ‘రంగ్ దే’ చిత్రం కూడా ఇదే ఏడాది మార్చి 29న విడుదల కానుంది. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో అభిమానులను అలరించేందుకు నితిన్ సిద్ధమవుతున్నాడన్నమాట.