ఉదయ్ కిరణ్.. టాలీవుడ్‌లో లవర్ బాయ్ అనే పదం వినగానే గుర్తుకువచ్చే తొలి పేరు. అచ్చం పక్కింటి కుర్రాడిలా ఉంటాడు ఉదయ్. అతని ఎప్పుడూ అమాయకత్వం ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ ‘ సినిమాలతో వరుస హిట్స్ అందుకుని స్టార్ డమ్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాతి కాలంలో వరుస ఫెయిల్యూర్స్ చవిచూశాడు. ఆపై అర్థాంతరంగా ఉరి వేసుకుని తనువు చాలించాడు. దీంతో అతడి ఫ్యాన్స్ తల్లడిల్లిపోయారు. ఉదయ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు. కెరీర్ సరిగ్గా సాగకపోవడం అని కొందరు అంటే.. పర్సనల్ రీజన్స్ అని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఉదయ్ తొలి చిత్రం దర్శకుడు తేజ అతడి మరణంపై సంచలన కామెంట్స్ చేశారు.
అతడి లైఫ్‌లో జరిగిన విషయాలన్నీ తనకు తెలుసని తేజ చెప్పుకుచ్చారు. తనతో ఉదయ్ అన్నింటినీ పంచుకునేవాడని వివరించారు. అతడు సూసైడ్ చేసుకోవడానికి గల రీజన్స్ కూడా తెలుసన్నారు. సమయం వచ్చినప్పుడు వాటిని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తానని వెల్లడించారు. తాను చనిపోయేలోపు ఆ విషయాలు వెల్లడిస్తా అని చెప్పారు తేజ. ఇప్పుడు చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు.
వరుస విజయాలతో ఫేమ్ వచ్చాక ఉదయ్ బ్యాలెన్స్ తప్పినట్లు తేజ తెలిపారు. కానీ అది తనకు పొగరులా కనిపించలేదని.. అమాయకత్వంలా అనిపించిందని వివరించారు. అతడి కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్లీ పిలిచి ‘ఔనన్నా కాదన్నా’లో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఉదయ్ ఎమెషనల్ అయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు తేజ. ‘మీ పట్ల కొన్ని విషయాల్లో కాస్త పొగరుగా ప్రవర్తించా.. అవేమీ పట్టించుకోకుండా నన్ను పిలిచి మరీ సినిమా ఇచ్చారు. మీ పాదాలు తాకి.. క్షమాపణ కోరతా. మన్నించండి’ అని ప్రాదేయపడ్డాడు. అవేమీ అవసరం లేదని ఉదయ్‌ను సముదాయించినట్లు తేజ తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..