Jani Master: జైలుపాలైన జానీ మాస్టర్… ఫ్యూచరేంటి? కెరీర్ ఖతమేనా?

|

Sep 21, 2024 | 7:59 PM

జైలుపాలైన జానీ మాస్టర్..! జనసేన చిన్నోడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! టాలీవుడ్‌లో లవ్‌ జిహాదీ రగడ.. ! టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ కెరీర్ ఖతమేనా..? ఇలా.. కొన్నిరోజులుగా నేషనల్ హాట్‌ టాపిక్‌గా మారింది జానీ మాస్టర్ ఎపిసోడ్. కాసేపు చల్లబడినట్టు కనిపించినా.. ఎప్పటికప్పుడు కొత్త టర్న్ తీసుకుంటూనే ఉంది. జానీ మాస్టర్ ఎపిసోడ్‌లో మరిన్ని అరెస్టు వార్తలు వినాల్సి వస్తుందా? అసలు జానీ తనకు తానే ఇరుక్కున్నారా.. ఎవరైనా పనిగట్టుకుని ఇరికించారా..? అనేది కొత్త చర్చ.

Jani Master: జైలుపాలైన జానీ మాస్టర్... ఫ్యూచరేంటి? కెరీర్ ఖతమేనా?
Jani Master
Follow us on

తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు జానీ మాస్టర్ జీవిత చక్రాన్ని గిర్రున రివర్సులో తిప్పేసింది. ప్రస్తుతానికి అరెస్టయి రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు జానీ మాస్టర్. ఔను ఇదంతా నేనే చేశా అంటూ నేరాన్ని ఒప్పుకున్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్‌లో రాసిచ్చారు పోలీసులు.

షూటింగ్ పేరుతో హోటల్స్‌కి తీసుకెళ్లిన మాట నిజం.. 2020లో ముంబై హోటల్‌లో లైంగిక దాడి చేసింది నిజం.. ఎవరికైనా చెబితే ఊస్టింగే అని జానీ భార్య బెదిరించింది నిజం.. నిజం నిజం నిజం.. ఇది నిజ్జంగా నిజం.. అని ఒప్పేసుకున్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో రాసి మేజిస్ట్రేట్ ఎదుట విప్పేశారు. కానీ.. పోలీసుల దగ్గర జానీకి సంబంధించి మరో వెర్షన్ కూడా బైటికొస్తోంది. ”ఎలాంటి లైంగిక వేధింపులకూ పాల్పడలేదు.. దురుద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేయించారు.. లీగల్‌గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా… నన్ను ఇరికించిన వాళ్లను వదలిపెట్టను..” అంటూ జానీ ఎమోషనల్ ఐనట్టు కూడా చెబుతున్నారు.

పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ నిజమా.. నేను వంద శాతం శుద్దపూసను.. అంటున్న జానీ వెర్షన్ నిజమా.. అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ప్రస్తుతానికి జానీ మాస్టర్‌ కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పది రోజులపాటు కస్టడీకిస్తే పూర్తిస్థాయిలో విచారించేందుకు వెసులుబాటు ఉంటుందని, మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే.. బాధితురాలు ఇచ్చిన 40పేజీల ఫిర్యాదు పత్రాన్ని, పోలీసులిచ్చిన రిమాండ్ రిపోర్ట్‌ను సమగ్రంగా చదివాక కస్టడీ పిటిషన్‌పై సోమవారం తీర్పు రాబోతోంది. జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశముంది.

అటు.. బెయిల్ కోసం జానీ మాస్టర్ తరఫు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో జానీకి బెయిల్ వస్తుందా రాదా అనేది సస్పెన్స్‌గా మారింది. తొమ్మిదేళ్ల కిందట జరిగినట్టు చెబుతున్న లైంగిక దాడికి సంబంధించి ఆధారాలు దొరకవు కనుక.. పోక్సో కేసు నిలబడబోదని జానీ లాయర్ల నమ్మకం. అందుకే… రంగారెడ్డి జిల్లాకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటు… న్యాయపోరాటం జరుగుతుంటే.. జానీ మాస్టర్ రొమాంటిక్ క్రైమ్ కహానీలో మరో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ కూడా ఆన్‌ ది వే…!

జానీ విషయంలో సినిమా పరిశ్రమ రెండుగా చీలింది. జానీ వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న సౌండ్‌ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఇరుక్కున్నారా.. ఇరికించారా త్వరలోనే తేలుతుంది అంటున్న జానీ జిగ్రీల వాదన.. రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు తావిచ్చింది. జానీ కెరీర్ ఖతం చేయాలనే ఆపరేషన్ ఎక్కడ ఎలా ఎందుకు ఎప్పుడు మొదలైంది..? జానీ మాస్టర్ ద్వారా జనసేనను, జనసేన అధినేతను ఇబ్బంది పెట్టాలని ఎవరైనా ప్లాన్ చేశారా..? తొమ్మిదేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫిమేల్ కొరియోగ్రాఫర్ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఎందుకు కంప్లయింట్ ఇచ్చినట్టు..? వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టిమరీ రిస్క్ చేసిందంటే.. ఎలా అర్థం చేసుకోవాలి..? అనే ప్రశ్నలతో టాలీవుడ్‌ సైతం కుతకుతా ఉడుకుతోంది. మరో ఇద్దరు లేడీ డ్యాన్సర్లు కూడా జానీమాస్టర్‌పై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నది మరో బ్రేకింగ్ న్యూస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.