Veturi Sudararamamurthy : పాటలమ్మ కంఠ హారానికి పదాల వజ్రాలను పొదిగిన పదశిల్పి వేటూరి

| Edited By: Phani CH

May 22, 2021 | 12:58 PM

ఎందుకో వేటూరి సుందరరామమూర్తి లేరనే భావన అసలు కలగడం లేదు. నిత్యం ఆయన పాటలే మారుమోతున్నప్పుడు ఆయన మన మధ్య లేరని ఎలా అనుకుంటాం!

Veturi Sudararamamurthy : పాటలమ్మ కంఠ హారానికి  పదాల వజ్రాలను  పొదిగిన   పదశిల్పి వేటూరి
Veturi
Follow us on

ఎందుకో వేటూరి సుందరరామమూర్తి లేరనే భావన అసలు కలగడం లేదు. నిత్యం ఆయన పాటలే మారుమోతున్నప్పుడు ఆయన మన మధ్య లేరని ఎలా అనుకుంటాం! తెలుగు సినిమాకు పాటల పందిరి వేసి, తెలుగు పాటలమ్మికి పట్టు చీరలు తొడిగిన ఆ మహానుభావుడిని ఎలా మర్చిపోతాం? మర్చిపోవడానికి ఆయన జ్ఞాపకం కాదు కదా! ఆయన నిత్యస్మరణీయుడు కదా! ఇంటిపేరు వేటూరి. ఒంటి పేరు సుందరరామమూర్తి, ఊరిపేరు పెదకళ్ళేపల్లి, పుట్టింది 1936, జనవరి 29. చదివింది మద్రాస్, విజయవాడ. తిరుపతి వెంకట కవులు, దైతాగోపాలం, మల్లాదిగార్ల దగ్గర శిష్యరికం.. ఆంధ్రప్రభలో ఉపసంపాదకత్వం.. కే. విశ్వనాధ్ తీసిన ఓ సీతకథ తో సినీరంగ ప్రవేశం. ఆ తరువాత… చెప్పేదేముందీ ఎనిమిది నందులు. ఒక జాతీయగౌరవం దక్కించుకున్న పాటలకు పదాలద్దిన ఘనత వహించారు. . ఇదీ వేటూరికి చెందిన సంక్షిప్త సమాచారం. ఇవాళ ఆ మహానుభావుడి వర్ధంతి… అనుకోడానికే కానీ ఆయన మన మధ్య లేనిదెప్పుడనీ…. పాటగా ప్రతీ రోజు మనల్ని పలకరిస్తూనే వున్నారు… సందర్భం వచ్చింది కాబట్టి ఆయను గురించి పునశ్చరణ చేసుకుందాం!

ఆయన పాటల్లో ఫలానా పాట బాగుంది.. ఫలానాది బాగోలేదు అని చెప్పడం సాహసమే అవుతుంది కాబట్టి పాటల జోలికి పోకుండా ఆయన పాటను తీర్చిదిద్దిన వైనం గురించి చెప్పుకోవడం ఉత్తమం. ఆయన పాటను పరవళ్లు తొక్కించారు. ఉరకలెత్తించారు. భాష భావుకతలు ఆయనకు రెండు కళ్లు. ఆయన సవ్యసాచి. ఆయన పాళికి రెండు వైపులా పదునే! మసాలాలు దట్టించి మాస్‌ను పట్టుకోగలరు. సంస్కృత సమాసాలు పట్టించి క్లాస్‌ను ఆకట్టుకోగలరు. అసలు తెలుగు సినిమా పాటను కోటి రూపాయల స్థాయికి తీసుకెళ్లింది ఆయనే! ఆయనది ప్రత్యేకమైన శైలి. ఎవరికి అందని బంగారు పాళి. ఒక్కోసారి ఆయన మల్లాది అనిపిస్తారు.. సముద్రాలలా వినిపిస్తారు…పింగళిలా కనిపిస్తారు….కృష్ణశాస్త్రి పద పల్లవంలా వికసిస్తారు. శ్రీశ్రీలా మెరిపిస్తారు.. ఆత్రేయలా విలపిస్తారు. తెలుగు సినీ సరస్వతికి పాటల మాలలు అల్లిన సృజనశీలి. సినీ సంగీత లక్ష్మికి సుగంధాలను అద్దిన పదశిల్పి.

పాటను సర్వాలంకార భూషితంగా తీర్చిదిద్దడంలో వేటూరి ఘనాపాటి. సరస సరాగాల సుమవాణిగా వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. మాటలనే పాటలుగా లయాత్మక విన్యాసాలుగా సున్నితంగా మలచిన మేటి! తేనెకన్నా తీయని తెలుగు నుడికారాలను మనకందించిన తేటి! కాలంతో పాటే పాట నడకను మార్చడంలో ఆయనకెవ్వరూ లేరు పోటి. ఏడో దశకంలో పిల్ల తెమ్మరలా ప్రవేశించి…చిరుగాలిలా చెలరేగి…ప్రభంజనమై వీచారు. వేటూరి పెన్ను చేయని విన్యాసం లేదు. రాయని భావ సౌందర్యం లేదు. సినిమా పాటకు కొత్త వగరునీ.. పొగరునీ …పరిమళాన్నీ తెచ్చింది వేటూరే! ఆయన తన బాణీతో పాటకి వోణీలు వేయించీ తీయించిన గడుగ్గేయ చక్రవర్తి! ఆ పాటేశ్వరుడికి సమవుజ్జీ ఎవరూ లేరు. భక్తి…ముక్తి…రక్తి…శృంగారం.. వేదాంతం.. జానపదం…పౌరాణికం.. ఒకటేమిటి అన్నింటిలోనూ ఆయన ముద్ర వేసుకున్నారు. సముద్రమంత ఆయన జ్ఞానానికి ముగ్దులై.. మురిసిపోయి..సీనియర్లంతా తమ పెన్నులకు క్యాప్‌లు పెట్టేసుకున్నారు.

తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టకు రంగు రంగుల పూలిచ్చారు. కొమ్మకొమ్మకో కోటిరాగాలనిచ్చారు. తెలుగు వారి హృదయాల్లో మల్లెలు పూయించారు.. వెన్నెల కాయించారు. పాటలమ్మ కంఠంలోని హారానికి పదాల వజ్రాలను అందంగా.. అలంకారంగా పొదిగిన ఆ పదశిల్పి నిజంగానే కారణజన్ముడు.. ఆయన వంటి కవి వెయ్యేళ్లకు కానీ పుట్టడు. ఈ సహాస్రాబ్దిలో పుడతారన్న నమ్మకం లేదు.
ఆ ఆధునిక తెలుగు సినీ పాటల చక్రవర్తికి మరణం వుండదు.. ఆయన చిరంజీవి…తెలుగు పాట వున్నంత కాలం ఆయన మనమధ్యనే… మనతోనే వుంటారు. ఆయన కలం సోకిన సినీ సంగీత నాదం ఝమ్మంటూ మోగుతూనే వుంటుంది. తెలుగువారి తనువులు ఆ మంగళనాదంతో ఊగుతూనే వుంటాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Jio: తెలుగు రాష్ట్రాల్లోని జియో యూజర్లకు శుభవార్త… ఇక డబుల్ స్పీడ్‌తో డేటా .. ( వీడియో )

Viral Video: చపాతీలు ఇలా కూడా చేస్తారా..?? ఈ స్టైల్ చూసి ఫిదా ఆయన నెటిజన్లు.. ( వీడియో )

Viral Video: పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ.. వైరల్‏గా మారిన వీడియో..