Balagam Collection: ఓటీటీలోకి దిగినా.. దసరా వచ్చినా.. ఐపీఎల్ ముసిరినా.. థియేటర్లలో తగ్గని బలగం కలెక్షన్స్
ఈ రోజుల్లో 50 డేస్ ఆడే సినిమాలు ఎక్కడున్నాయి చెప్పండి. ఫస్ట్ వీక్ బాగా ఆడితేనే గొప్ప. సినిమా బాగుంటేనే వారం రోజులు. యావరేజ్ అయితే మూడు రోజులు. కంటెంట్ లేకపోతే రెండో రోజే ఎత్తేస్తున్నారు. ఇలాాంటి సమయంలో 50 రోజుల దిశగా దిగ్విజయంగా దూసుకుపోతుంది బలగం మూవీ. కలెక్షన్స్ కూడా దుమ్ము లేపుతున్నాయి.
బలగం సినిమా మంచి సినిమా.. చానా మంచి సినిమా. తెలుగు మట్టి నుంచి పుట్టిన సినిమా. అందరి ఇళ్లల్లో జరిగే కథే. అందుకే జనాలు సినిమాని అంతగా హిట్ చేశారు. ఇది కదా అసలు సినిమా అంటే పట్టం కట్టేశారు. ఈ సినిమాని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది. మనం మర్చిపోయిన బంధుత్వాలను, బావోద్వేగాలను తట్టి లేపుతుంది. పల్లెల అందాను కొత్తగా చూపిస్తుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. థియేటర్లలో బాగా ఆడుతుండగానే.. సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇంత మంచి సినిమాను ఆదరించకపోతే.. మళ్లీ గొప్ప సినిమాలు తీయరేమో అని కంగారుపడ్డారో ఏమో.. జనాలు ఇంకా థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షిస్తున్నారు.
చిత్రం రిలీజై నెల రోజులు కంప్లీట్ అయినా కలెక్షన్స్ తగ్గట్లేదు. ఓటీటీలో చూసినవాళ్లు సైతం ఇది థియేటర్ సినిమారా భయ్ అంటూ.. మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నాని పాన్ ఇండియా సినిమా దసరా రిలీజైనా.. మరోవైపు ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నా.. బలగం వసూళ్లు మాత్రం తగ్గలేదు. ఈ సినిమా 30 వ రోజు కూడా 30 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ పండితుల నుంచి సమాచారం అందింది. మొత్తం 30 రోజులుకు గానూ 26 కోట్లకు పైగా గ్రాస్, 13 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది.
మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ సినిమా రిలీజైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంటే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఊర్లో గతంలో తెరపై సినిమాలు ప్రదర్శించేవారు. ఊర్లోని జనాలంతా వచ్చి సినిమా వీక్షించేవారు. బలగం సినిమా ఆ ట్రెండ్‌ను మళ్లీ తీసుకువచ్చింది. బలగంకు బలం ఎమోషన్స్ అని మాత్రం చెప్పక తప్పదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.