Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల పునరుద్ధరణ గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కొందరు చిరంజీవి వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఆయనను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్న చిరు.. ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఆయన మాటలను కొందరు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై దర్శకుడు వీవీ వినాయక్ కాస్త ఘాటుగా స్పందించారు. ‘చిరంజీవి గారి గురించి కొందరు మాట్లాడినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. వాటి గురించి నేను ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. ఒకవేళ మేము ఎప్పుడైనా అలా మాట్లాడినా కూడా చిరంజీవి గారు మమ్మల్ని తిడతారు. అసలు చిరంజీవి మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఒకప్పుడు నంది అవార్డులు చాలా అంగ రంగ వైభవంగా జరిగేవి. ఉగాది రోజు పండగ అంతా అక్కడే ఉన్నట్టు ఉండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు. ఒక పెద్ద సెలబ్రేషన్ లా జరిగేది. చిరంజీవి ఆయన కోసం అవార్డులు ఇవ్వమని కోరలేదు. అందరూ ఆనంద పడతారనే ఉద్దేశంతోనే అలా అన్నారు. అది కూడా తప్పని అనడం సమంజసం కాదు. దయచేసి అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి మనిషి మీద విమర్శలు చేయకండి. దగ్గరగా ఉన్న నాలాంటి వాడికి తెలుసు ఆయన శక్తి. ఎప్పుడు కూడా నిజాయితీగల ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే, అది కచ్చితంగా ఏదొక విధంగా వాళ్లకే తగులుతుంది. చిరంజీవిని ఎవరైతే కామెంట్ చేస్తారో, వాళ్లంతా ఏదో ఒక రకంగా నాశనమైపోతారు. నాకు కొన్ని వందల ఉదాహరణలు తెలుసు. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్లు ఎవరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లేరు. ఏదో రకంగా పాడైపోయారు’
‘గతంలో ఒక నిర్మాత ఏదో కామెంట్ చేసాడని రెండు మూడు వేల మంది అభిమానులు బస్సులు వేసుకొని ఈయన ఇంటికి వచ్చారు. చెప్పు తీసుకొని కొడతానని చిరంజీవి వాళ్లందరినీ తిట్టారు. ‘ఏంటి తమాషాలు వేస్తున్నారా? నన్నంటే మీకు బాధ ఏంటి?’ అని అభిమానులను వారించారు. అలాంటి ఆయనపై ఇలాంటి చెత్త కామెంట్స్ ఎందుకు? నంది అవార్డులు గురించి చిరంజీవి చెప్పింది అందరి అభిప్రాయం. నిజంగానే చక్కగా అవార్డులు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆయన ఎవరి పేరు తీసి ఏమీ అనలేదు. అసలు రాజకీయాలకి ఆయనకీ సంబంధం లేదు. ప్రభుత్వానికి ఆయనకి సంబంధం లేకపోయినా, అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన ఓ కార్యక్రమం జరుగుతుంటే చిరంజీవిని ఆహ్వానించారు. ఆ సమయంలో స్టేజ్ మీద ప్రధాని మోడీ గారు లేచి మరీ చిరంజీవి గారిని కలిశారు. తెలుగు వాడిగా ఆయనకి గౌరవం ఇచ్చారు. బయటంతా ఇలా చిరంజీవిని కీర్తిస్తుంటే, సినిమా ఇండస్ట్రీలో మనం నెత్తిన పెట్టుకోవాల్సింది మనమే కామెంట్ చేస్తే.. ఏంటండీ ఈ దరిద్రం’ అని ఫైర్ అయ్యారు వీవీ వినాయక్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




