K. Raghavendra Rao: దర్శకేంద్రుడికి అపూర్వ గౌరవం.. టీవీ9 నవనక్షత్రం సన్మానంలో జీవిత సాఫల్య పురస్కారం..

దాదాపు 100కు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకేంద్రుడిగా కీర్తిని గడించిన రాఘవేంద్రరావుకు టీవీ9 తెలుగు నవనక్షత్ర సన్మానం 2022 లో లైఫ్ టైంఅచీవ్మెంట్ పురస్కారం అందించింది.

K. Raghavendra Rao: దర్శకేంద్రుడికి అపూర్వ గౌరవం.. టీవీ9 నవనక్షత్రం సన్మానంలో జీవిత సాఫల్య పురస్కారం..
Ragavendra Rao

Edited By:

Updated on: Sep 01, 2022 | 4:31 PM

TV9 Nava Nakshatra Sanmanam: తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకేంద్రుడు కొవెలమూడి రాఘవేంద్రరావు స్థానం ప్రత్యేకం. తెలుగు చిత్రాలను కమర్షియల్ బాట పట్టించిన డైరెక్టర్ ఆయన. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి.. ప్రతి ఫ్రేమ్‏లోనూ సరికొత్తధనం తీసుకువచ్చి ప్రేక్షులను మెప్పించారు. అంతేకాకుండా తన సినిమాల్లో కథానాయికలను మరింత అందంగా చూపించడంలో ఆయనకు మరెవరు సాటిలేరు. దాదాపు 100కు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకేంద్రుడిగా కీర్తిని గడించిన రాఘవేంద్రరావుకు టీవీ9 తెలుగు నవనక్షత్ర సన్మానం 2022 లో లైఫ్ టైంఅచీవ్మెంట్ పురస్కారం అందించింది.

టీవీ9 ప్రతిష్టాత్మకంగా నవనక్షత్ర సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. టీవీ9 నవనక్షత్రం -2022 కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రంలో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న దర్శకుడు రాఘవేంద్రరావుకు లైఫ్ టైంఅచీవ్మెంట్ పురస్కారం అందించింది టీవీ9.

మూడు తరాలకు హీరోలను తయారు చేసి.. మూడు జనరేషన్‌ల ఆడియన్స్‌ను కూడా మెప్పించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అసాధ్యాలను వెండితెర సాక్షిగా సుసాధ్యం చేసిన దర్శకుడు కే. రాఘవేంద్ర రావు. తండ్రి అడుగులు జాడల్లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన రాఘవేంద్రుడు.. తెలుగు సినిమాను కొత్త పంథాలో అడుగులు వేయించారు. ఆమె కథ లాంటి ఆఫ్‌ బీట్ సినిమా… అడవి రాముడు లాంటి మాస్ కమర్షియల్‌ సినిమా… జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఫాంటసీ డ్రామా… పెళ్లి సందడి లాంటి ఫ్యామిలీ మూవీ… అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రం.. ఈ సినిమాలన్ని ఒకే దర్శకుడి నుంచి వచ్చాయంటే ఆ చిరునవ్వు వెనక సినిమా మీద వున్న ప్రేమ కనపడుతుంది . . ఆయన ఆలోచనలకు ఎల్లలు లేవు. వెండితెర మీద ఆయన సృష్టించిన రికార్డ్‌లకూ లెక్కలు లేవు.

ఇవి కూడా చదవండి

మూసగా సాగిపోతున్న తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులతో కలర్‌ఫుల్‌ టచ్‌ ఇచ్చిన మెజీషియన్ రాఘవేంద్రుడు. ఆయన వెండితెర మీద చేసిన ఇంద్రజాలానికి మంత్ర ముగ్దులైన ఆడియన్స్‌ దర్శకేంద్రుడు అనే బిరుదుతో గౌరవించుకున్నారు. తెలుగు తెరకి సరికొత్త గ్లామర్‌ని తీసుకొచ్చిన దర్శకుడు రాఘవేంద్రుడే. హీరోయిన్లను తెర మీద అందంగా చూపించడంలో, సిల్వర్‌ స్క్రీన్‌ను అందమైన కాన్వాస్‌లా మలచడంలో దర్శకేంద్రుడిని మించిన దర్శకులు తెలుగులో లేరంటే అతిశయోక్తి కాదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమయిన ప్రతీ ఒక్కరు దర్శకేంద్రుడి లెన్స్‌లో ఒక్క ఫ్రేమ్‌లో అయినా కనిపించాలని కోరుకుంటారు.

దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన చేయని ప్రయోగం లేదు.. ఆయన సాధించని విజయం లేదు.. ఆయన చూడని శిఖరం లేదు.. తెలుగు సినిమా తరాలు తరాలు చెప్పుకునే ఎన్నో అద్భుతాలను అందించిన రాఘవేంద్రరావుకి టీవీ9 నవనక్షత్ర సన్మానం 2022 లో లైఫ్ టైంఅచీవ్మెంట్ పురస్కారం అందించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.