AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remuneration: చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్ మొదటి సంపాదనగా అందుకున్నది ఎంతో తెలుసా?

ఎంత సంపాదించినా మొదటి సంపాదన, మొదటి జీతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మన స్టార్లు కూడా మనలాంటి వాళ్లే కదా. వాళ్ల మొదటి సంపాదన కూడా ఎంతో విలువైనది. ఇప్పుడు ఎంత సంపాదించి దాచుకున్నప్పటికీ వాళ్లకు కూడా గుర్తుండిపోయేది మొదటిసారి ఎంత అందుకున్నారు అనేది.

Remuneration: చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్ మొదటి సంపాదనగా అందుకున్నది ఎంతో తెలుసా?
Chiru Mahesh And Pawan
Nikhil
|

Updated on: Jan 08, 2026 | 6:30 AM

Share

ప్రస్తుతం ఒక్కో సినిమాకు వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న మన టాలీవుడ్ హీరోలందరూ ఒకప్పుడు సామాన్యంగానే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. నేడు గ్లోబల్ స్టార్స్‌గా వెలుగుతున్న ఈ నటుల మొదటి సంపాదన ఎంతో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొందరు వేలల్లో అందుకుంటే, మరికొందరు లక్షల్లో పొందారు. ఇంకొందరు మాత్రం అసలు రూపాయి కూడా తీసుకోకుండానే కెరీర్ ప్రారంభించారు. గూగుల్‌లో నెటిజన్లు తెగ వెతికేస్తున్న మన స్టార్ హీరోల తొలి రెమ్యూనరేషన్ల అసలు లెక్కలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మెగాస్టార్ చిరంజీవి

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి నేడు కోట్లాది మందికి రోల్ మోడల్. 1978లో విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాకు ఆయన అందుకున్న తొలి పారితోషికం కేవలం 1000 రూపాయలకు పైగా మాత్రమే. ప్రస్తుతం ఆయన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కాబోతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక ప్రత్యేక మేనరిజం సృష్టించుకున్న పవన్ కళ్యాణ్, 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమాకు గాను ఆయనకు నెలకు 5000 రూపాయల చొప్పున పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలతో ఆయన అలరించబోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు

బాలనటుడిగా ఎన్నో హిట్లు అందుకున్న మహేష్ బాబు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా తన మొదటి సినిమాకే ఆయన 5 నుండి 10 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్

నేడు పాన్ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్, 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఆ సినిమాకు ఆయన 5 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మెగాస్టార్ తనయుడిగా ‘చిరుత’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్, తన మొదటి సినిమాకు వచ్చిన పారితోషికాన్ని తన దగ్గర ఉంచుకోకుండా చారిటీకి ఇచ్చేసి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

జూ. ఎన్టీఆర్

నందమూరి వారసుడిగా చిన్నప్పుడే బాలరామాయణంతో మెప్పించిన ఎన్టీఆర్, ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమాకు ఆయన 4 లక్షల రూపాయలు అందుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగా డిమాండ్ చేసే స్థాయికి చేరిన ఆయన, త్వరలో ‘డ్రాగన్’ సినిమాతో రాబోతున్నారు.

ఇతర స్టార్స్

నేచురల్ స్టార్ నాని తన మొదటి సినిమాకు 4000 రూపాయలు అందుకోగా, విజయ్ దేవరకొండ కేవలం 500 రూపాయలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. విచిత్రం ఏమిటంటే, నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ తన మొదటి సినిమాకు జీరో రెమ్యూనరేషన్ తీసుకున్నారట. వేలల్లో మొదలైన వీరి ప్రయాణం నేడు కోట్ల రూపాయల సామ్రాజ్యానికి చేరింది. ఇదంతా వారి కష్టం, పట్టుదల వల్లే సాధ్యమైంది.