
తెలుగు సినీ చరిత్రలో రచయితగా, నటుడిగా చెరగని ముద్ర వేశారు గొల్లపూడి మారుతీరావు. తన విశేషమైన సినీ ప్రస్థానం, డబ్బు పట్ల తన ప్రత్యేక దృక్పథం, రచన పట్ల తనకున్న అచంచలమైన ప్రేమ గురించి గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన జీవితంలో డబ్బు ఎప్పుడూ ఒక సమస్య కాలేదని, తన అవసరాల కంటే ఎక్కువే లభించిందని ఆయన అన్నారు. తాను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, డబ్బు లెక్కించడంలో తనకు ఆసక్తి లేదని, తన భార్యే తన ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారని తెలిపారు. సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత పేరు, ప్రఖ్యాతులు, డబ్బు సమృద్ధిగా వచ్చినా, నటన పట్ల తనకు అంతగా ఇష్టం ఉండేది కాదని గొల్లపూడి మారుతీరావు గారు వెల్లడించారు.
“ఎందుకయ్యా ఈ దిక్కుమాలిన షూటింగ్, రాత్రి 12 గంటలకు నాకు షూటింగ్ ఎందుకయ్యా నన్ను చంపేస్తున్నారు” అని తాను భావించేవాడినని, నటనను ఒక అనవసరమైన శ్రమగా చూశానని పేర్కొన్నారు. కానీ సినిమాలను మాత్రం ఎంతో కష్టపడి, నిబద్దతతో పని చేశా అని అన్నారు. ఏడాదికి 31 నుంచి 32 చిత్రాల్లో నటించినట్లు ఆయన వెల్లడించారు. నటన తనకు ఒక గొప్ప రచయితగా పేరు తెచ్చుకోకుండా అడ్డుకుందేమోనని ఒకప్పుడు భావించినట్లు మారుతీరావు గారు తెలిపారు. గొప్ప రచయితగా గుర్తింపు పొందడమే తన నిజమైన అభిమతమని, అది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు.
సినిమా రంగంలో బిజీగా ఉండటం వల్ల కొన్ని విషయాలను కోల్పోయానని ఆయన అన్నారు. తన పిల్లల బాల్యాన్ని తాను సరిగా చూడలేకపోయానని, తన భార్యతో కలిసి మార్కెట్‌కి వెళ్లి సంతోషంగా కూరగాయలు కొనుక్కోవాలనే సాధారణ జీవితాన్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ప్రైవసీకి దూరమైనట్లు తెలిపారు. రాజమండ్రిలో ఒక నిమ్మకాయల వ్యాపారి తనను చూడగానే నిమ్మకాయలు ఉచితంగా ఇచ్చేవారని, అది తనకు అభిమానం పట్ల ఉన్న ఆనందాన్ని తెలియజేస్తుందని చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి