
దర్శకుడు త్రివిక్రమ్ గురించి సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో తన డైలాగ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే ఈ మాటల మాంత్రికుడు.. నిజ జీవితంలోనూ తనదైన శైలిలో మాట్లాడుతుంటారు. అందుకే త్రివిక్రమ్ స్పీచ్ వస్తుంటే ఇట్టే వింటూ ఉండిపోవాలనుకుంటారు.
ఇక తనకు ఇంతటి జ్ఞానం వచ్చింది పుస్తక పఠనంతోనేని చెబుతుంటారు త్రివిక్రమ్. పుస్తకాలకు ఎంతో గొప్పతనం ఉంటుందని చెబుతుంటారు. ఆయన స్పీచ్‌లో కచ్చితంగా పుస్తకం ప్రస్తావన ఉండాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న త్రివిక్రమ్ పుస్తకాల గొప్పతనం గురించి తనదైన శైలిలో వివరించారు. అసలు పుస్తకాలు ఎందుకు చదవాలన్న దాని గురించి అద్భుతంగా తెలిపారు. త్రివిక్రమ్ చెప్పిన మాటలు వింటే మీరు కూడా వెంటనే పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటారు. ఇంతకీ త్రివిక్రమ్ ఏమన్నారంటే..
పుస్తకం చదవడం వల్ల మనిషిలో ఎంతో మార్పు వస్తుందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. పుస్తకాలు చదివితే టెక్నాలజీతో పాటు వెనుకపడతామని అంతా భావిస్తుంటారన్న త్రివిక్రమ్.. తన దృష్టిలో మాత్రం అది తప్పు అన్నారు. ఇందుకు సంబంధించి త్రివిక్రమ్ ఓ లాజిక్ చెప్పారు. ‘సాధారణంగా మనం ఏదైనా చూసేటప్పుడు, వినేటప్పుడు పక్కవాళ్లతో మాట్లాడుతుంటా. అదే.. పుస్తకం చదివేటప్పుడు మాత్రం ఎవ్వరితోనూ మాట్లాడ్డానికి కుదరదు. ఆ సమయంలో మనతో మనమే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం నేటి తరానికి చాలా అవసరం. అప్పుడే మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానంలో మార్పు వస్తుంది. అవతలి వారు నొచ్చుకోకుండా మాట్లాడగలుగుతాం’అని చెప్పుకొచ్చారు.
ఇక సోషల్ మీడియాలో చాలామంది అవతలి వారిని బాధపెట్టేలా కామెంట్స్ చేస్తుంటారన్న త్రివిక్రమ్.. ఆ విషయం కామెంట్ చేసిన వాళ్లే తెలుసుకోలేకపోతున్నారన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించే లక్షణం మనుషుల్లో తగ్గిపోవడమే ఇందుకు కారణమని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు. చదవడం వల్ల ఆ ఆలోచన పెరుగుతుందని., అప్పుడు మనం ఉన్నతమైన వ్యక్తిగా మారతామన్నారు. తాను చదివిన చాలా పుస్తకాలు తనలో చాలా మార్పు తీసుకొచ్చాయని, పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదని, రాయిలాంటి మనిషిని కూడా పుస్తకం శిల్పంలా మారుస్తుందన్నారు. చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలని త్రివిక్రమ్ తెలిపారు.
చూశారుగా పుస్తకం విలువ గురించి త్రివిక్రమ్ ఎంత అద్భుతంగా తెలిపారో. ఒక మంచి పుస్తకం స్నేహితుడితో సమానం అని అనేందుకు ఇందుకే. అలాగే.. చిరిగిన చొక్కా తొడుక్కున్న సమస్య లేదు కానీ.. మంచి పుస్తకం కొనకుంటే మాత్రం అలాగే అజ్ఞానిలా ఉంటావు అని చెబుతుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ చెప్పిన మాటలు వింటుంటే ఇది నిజమే అనిపిస్తోంది కదూ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..