
టాలీవుడ్ ప్రముఖ నటుడు, జబర్దస్త్ కమెడియన్ జోష్ రవి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ అకస్మాత్తుగా కన్నుమూశారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా.. స్థానిక శివాలయంలో అభిషేకాలు చేయించడానికి వెళ్లిన జోష్ రవి తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆలయ ప్రాంగణంలోనే కుప్పకూలి పోయాడు. దీంతో భక్తులు ఆయనను ఇంటికి తరలించారు. అయితే తీవ్ర గుండెపోటు రావడంతో సూర్య వెంకట నరసింహ శర్మ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడి కుటుంబ సభ్యులు నిర్ధారించారు. కాగా తండ్రి మరణంతో జోష్ రవి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు జోష్ రవి ఇంటికి వెళుతున్నారు. రవి తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ భౌతికాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. సూర్య వెంకట నరసింహ శర్మకు నటుడు జోష్ రవి ఒక్కడే కుమారుడు. ఈ మేరకు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడీ ట్యాలెంటెడ్ నటుడు.
‘సినిమా అనేది నీకు సరదా..నాకు సినిమానే బతుకుదెరువు.. సినిమా నాకు సెంటిమెంట్.. అది నీకు జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమా అనేది నీకు వీకెండ్.. నాకు టిల్ మై లైఫ్ ఎండ్..అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నువ్వు కష్టాలు మర్చిపోవడానికి థియేటర్‌కు వస్తావ్.. నేను తండ్రి చనిపోయినా ఆ బాధను దిగమింగుకుని నవ్విస్తాను.. నీకు బాధ వస్తే ఏడుస్తావ్.. అదే నాకు వస్తే సినిమా చూస్తా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు జోష్ రవికి ధైర్యం చెబుతున్నారు. అతనికి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.
నాగా చైతన్య నటించిన ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రవి. తన ట్యాలెంటెడ్ యాక్టింగ్ తో జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోల చిత్రాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా చేసి మెప్పించాడు. అలాగే ‘జబర్దస్త్’ కామెడీ షోలోనూ తనదైన యాక్టింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.