
సీనియర్ నటుడు బాబూమోహన్ తన సినీ రంగం, రాజకీయ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను మూడు షిఫ్ట్‌లు, ఆరు సినిమాలతో చాలా బిజీగా ఉండేవారని, దానిని చూసి కొందరు అసూయపడేవారని అన్నారు. రోజుకు ఐదు, ఆరు షిఫ్టుల్లో పనిచేసేవాడినని, సరైన నిద్ర లేకుండా కుర్చీల్లోనే నిద్రపోయిన రోజులు అనేకం ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. పాటలు, డబ్బింగ్‌లు రాత్రుళ్లు, పగలు షూటింగ్‌లు, ప్రయాణాలతో క్షణం తీరిక లేకుండా గడిపేవాడినని వివరించారు. ఒక రోజులో రెండు గంటలు ఒక చోట, ఇంకో రెండు గంటలు మరో చోట షూటింగ్ చేసేవాడినని, లంచ్ బ్రేక్‌లో కూడా వేరే సినిమాకు వెళ్లి షూటింగ్ చేసి వచ్చేవాడినని తెలిపారు.
ఒక లొకేషన్ నుండి మరో లొకేషన్‌కు వెళ్లేటప్పుడు కారులోనే మేకప్ మ్యాన్‌ల సహాయంతో గెటప్స్ మార్చుకునేవాడినని, ఆ సమయంలో కర్డ్ రైస్ తిని సిద్ధమయ్యేవాడినని పేర్కొన్నారు. “హిట్లర్” సినిమా షూటింగ్ సమయంలో, దాసరి నారాయణరావు గారు చనిపోయే సీన్ కోసం ఉదయం వరకు చిత్రీకరణలో పాల్గొన్నానని చెప్పారు. ఎస్.వి. కృష్ణారెడ్డి గారి సినిమా షూటింగ్‌లో ఉదయం 7 గంటల వరకు పనిచేసి, బ్రష్ కూడా చేయకుండా చిరంజీవి గారు, దాసరి గారు కలిసి నటించిన ఒక హాస్పిటల్ సీన్ షూటింగ్ కోసం వెళ్లిన సందర్భాన్ని వివరించారు. తాను “సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా” వంటి చిత్రాలలో హీరోగా నటించినప్పటికీ, దానిని ఒక సాధారణ పాత్రగానే చూశానని బాబూమోహన్ తెలిపారు.
అంతకుముందు హీరోయిన్లైన ఆమని, సౌందర్య, సోను వాలియా, సిల్క్ స్మిత, అల్ఫాన్సాలతో పాటలు, ఫైట్‌లు చాలా చేశానని, కాబట్టి హీరో పాత్ర కొత్తగా ఏమీ అనిపించలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో రాణించడం, సినిమా రంగంలో హిట్స్ ఇవ్వడం రెండూ భిన్నమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. రెండింటిలోనూ తాను నెంబర్ వన్ స్థానంలో ఉన్నానని పేర్కొన్నారు. సినిమాలో ప్రతిభతో పాటు మంచి క్యారెక్టర్ లభించాలని, దాన్ని ప్రజలకు నచ్చేలా చేయాలని చెప్పారు. రాజకీయాలు ప్రజలతో సంబంధం ఉన్న రంగమని, అక్కడ వారి సమస్యలను పరిష్కరించగలగాలని, దానికి ఓర్పు, నేర్పు అవసరమని వివరించారు. సినిమాలో డైరెక్టర్, రైటర్, కెమెరామెన్ వంటి వారి సహకారం ఉంటుందని, అవసరమైతే పది టేకులు తీసుకోవచ్చని, కానీ రాజకీయాలు ప్రత్యక్ష ప్రసారం వంటివని, అక్కడ టేకులు ఉండవని, ప్రతిదీ లైవ్‌గా ఉంటుందని బాబూమోహన్ తెలిపారు.