
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక జంతర్ మంతర్ వేదికగా గళం విప్పిన జెన్‌జీ ఆందోళనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు, యువకులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీల నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఈ నిరసనల్లో భాగమయ్యారు. విద్యార్థులకు మద్దతుగా తమ గొంతు వినిపించారు. మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా విద్యార్థుల ఆందోళనళనకు మద్దతిచ్చారు. అయితే ఈ విద్యార్థుల నిరసనల్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడు ప్రత్యక్షంగా పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. గతంలో పలు తెలుగు హిట్ సినిమాల్లో నటించిన ఆ హీరో ఇప్పుడు జంతర్ మంతర్ వద్దవిద్యార్థులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అత్యవసరమని, విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడకూడదని వారికి మద్దతుగా గళమెత్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పై ఫొటో అదే. మరి ఇంతకీ అతనెవరో గుర్తు పట్టారా?
2002లో వచ్చిన ‘లాహిరి లహిరి లాహిరి’ సినిమా గుర్తుందా? అందులో నటించిన హీరో ఆదిత్య ఓమ్ యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి చిత్రంతోనే లవర్ బాయ్ ట్యాగ్ తెచ్చుకున్నాడు. దీని తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో నటించాడు ఆదిత్య ఓమ్. అయితే ఎక్కువ కాలం హీరోగా కెరీర్ కొనసాగించలేకపోయాడు. వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో సినిమాలకు దూరమయ్యారు. 2013లో ‘బందూక్’ అనే సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’ లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. తన నిజయతీతో అందరి మనసులు గెల్చుకున్నాడు. సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే..ఆదిత్య ఓం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం తన వంతు సాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం జంతర్ మంతర్ వద్ద గొంతెత్తాడు. బహుశా.. టాలీవుడ్ నుంచి ఈ ఆందోళనల్లో పాల్గొన్నది ఆదిత్య ఓం ఒక్కరేనేమో!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.