
కానీ, ఒకప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. హీరోల మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ముఖ్యంగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు వెండితెరపై పోటీ పడినా, బయట మాత్రం ప్రాణ స్నేహితులు. ఒకరి సినిమా కోసం మరొకరు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సహకరించుకునేంత గొప్ప బంధం వారిది. పవర్ స్టార్ సినిమా కోసం సూపర్ స్టార్ స్వయంగా రంగంలోకి దిగి తన గొంతును అప్పుగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఆ సినిమా ఏంటి? మహేష్ బాబు చేసిన ఆ సాయం వెనుక ఉన్న కథేంటి?
“మేము మేము బానే ఉంటాం.. మీరే బాగుండాలి” అని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా, హీరోల మధ్య మాత్రం మంచి బాండింగ్ ఉంటుంది. మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు కచ్చితంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనమే 2008లో విడుదలైన ‘జల్సా’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అలియాస్ సంజయ్ సాహూ ఎంట్రీ ఇవ్వకముందే మనకు మహేష్ బాబు గొంతు వినిపిస్తుంది. ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం.
అప్పట్లో పవన్ కళ్యాణ్ వరుసగా ఐదు ప్లాపులతో ఇబ్బందుల్లో ఉన్నారు. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథను సిద్ధం చేశారు. ‘అతడు’ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో పాటు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్నేహం కారణంగా వాయిస్ ఓవర్ ఇవ్వమని అడగ్గానే మహేష్ బాబు ఒప్పుకున్నారు. కేవలం ఒప్పుకోవడమే కాదు, ఆ పని చేసినందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా తన ఉదారతను చాటుకున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.
దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఇప్పటికీ ‘జల్సా’ పాటలు వింటుంటే అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇలియానా, పార్వతీ మెల్టన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కామెడీ హైలైట్‌గా నిలిచింది. రూ. 25 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా, ఫైనల్ రన్‌లో రూ. 29 కోట్ల షేర్ వసూలు చేసి బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
పవన్ కళ్యాణ్‌ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమాగా ‘జల్సా’ నిలిచిపోయింది. హీరోల మధ్య ఉండే ఇలాంటి స్నేహపూర్వక బంధం ఫ్యాన్స్‌కు ఒక సందేశం లాంటిది. ఒకరి విజయానికి మరొకరు తోడ్పడటం అనే సంస్కృతి టాలీవుడ్‌లో ఎప్పటి నుండో ఉంది. పవన్ – మహేష్ మధ్య ఉన్న ఈ హెల్తీ ఫ్రెండ్‌షిప్ ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా ఆదర్శం.