విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ‘పెళ్లి పుస్తకం’. 1991లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని .. వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే మనోరంజకమైన చిత్రం. ఇందులో దివ్యవాణి కథానాయికగా నటించగ.. కె.వి. మహదేవన్ సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈ చిత్రాన్ని బాపు రమణలు రూపొందించారు. పెళ్లికి అర్థాన్నీ, పరమార్ధాన్నీ ఇంత సున్నితంగా.. హృద్యంగా అందంగా.. అన్నింటినీ మించి హాస్యభరితంగా చెప్పిన చిత్రమే ఇది. దీనిని శ్రీసీతారామా బ్యానర్ పై నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే.. కేవలం బాదం ఆకులు లేవని ఈ సినిమా చిత్రీకరణను ఆపేశారట డైరెక్టర్ బాపు. స్క్రిప్టులో రాధాకుమారి, సాక్షి రంగారావు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటున్నట్లు రమణ రాశారు. షాట్స్ రాసినప్పుడు డైరెక్టర్ బాపు కూడా అదే రాసి.. బాదం ఆకుల విస్తర్లు కావాలి అని ప్రొడక్షన్ వాళ్లకు రాసి ఇచ్చారట. ఉదయం షూటింగ్ ప్రారంభమైంది. బాదం ఆకులు దొరకలేదని.. మామూలు విస్తరాకులు తెచ్చాైరు ప్రొడక్షన్ వాళ్లు. బాదం ఆకులు దొరక్కపోవడం ఏంటని.. పొద్దున్నే రాసి ఇచ్చాము కదా.. ఏమేం కావాలో.. బాదం ఆకుల విస్తర్లే కావాలి.. వెళ్లి తీసుకురమ్మని ప్రొడక్షన్ వాళ్లకు చెప్పారట బాపు.
బాదం ఆకుల విస్తర్లు వచ్చే వరకు షూటింగ్ ఆపేశారట. దీంతో బాదం చెట్టు కోసం వెతికి చివరకు చిక్కడపల్లిలో ఒకరి ఇంట్లో ఉండే రెండు కార్లు వేసుకుని వెళ్లి ఆకులు కోసి తెచ్చి విస్తర్లు కుట్టి ఇచ్చేసరికి మధ్యాహ్నం అయ్యిందట. అప్పటికి ఇడ్లీలు చల్లారిపోవడం.. మళ్లీ వేడి ఇడ్లీలు తెప్పించి సీను షూట్ చేశారట. కానీ సినిమా పూర్తయ్యే సమయానికి నిడివి ఎక్కువ కావడంతో పలు సన్నివేశాలను తొలగించారు. అందులో ఈ బాదం ఆకుల విస్తర్ల సీన్ కూడా పోయింది. పెళ్లి పుస్తకం సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను హృదయాలను తాకుతుంది.