ది కేరళ స్టోరీ మూవీపై రచ్చ రగులుతోంది. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్నఈ చిత్రంపై కేరళలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదలను నిలిపివేయాలని అధికార, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తప్పిపోయిన అమ్మాయిల ఇతివృత్తంతో తెరకెక్కిన ది కేరళ స్టోరీ మూవీపై వివాదం కొనసాగుతోంది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి.. వారి ఆచూకీ ఎక్కడనే కథాంశంతో ది కేరళ స్టోరీ సినిమా రూపొందించారు. దీనికి సంబంధించి కొద్దిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ నలుగురు యువతులు మతం మారి, ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుందని అర్థమవుతోంది. అయితే.. తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది.
విడుదలకు సిద్ధమైన ది కేరళ స్టోరీ చిత్రంపై కేరళలో పెద్దయెత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇలాంటి సినిమాను విడుదల చేయొద్దంటూ అధికార, పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా.. ఈ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘాటుగా స్పందించారు. కేరళాను ప్రపంచం ముందు మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోందన్నారు. కానీ.. అలాంటి రాజకీయాలు కేరళలో పనిచేయవన్నారు సీఎం విజయన్.
మరోవైపు.. ది కేరళ స్టోరీ చిత్రం విడుదలను అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సమాజంలో విషం చిమ్మేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేరళలో ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొద్దని డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే.. వివాదం చెలరేగడంపై మూవీ డైరెక్టర్ సుదీప్తోసేన్ మరోసారి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడే మూవీపై ఓ అభిప్రాయానికి రావొద్దని.. సినిమా చూశాక.. ఒకవేళ నచ్చకపోతే అప్పుడు చర్చిద్దామన్నారు. ఇక.. ది కేరళ స్టోరీ మూవీకి విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. ఏదేమైనా.. ది కేరళ స్టోరీ మూవీ..ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. మూవీ రిలీజ్‌కు పర్మిషన్ ఇవ్వద్దొని అధికార, ప్రతిపక్షాలు వార్నింగులు ఇస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…