త్రివిక్రమ్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ.. హాజరైన కుటుంబ సభ్యులు

దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం (జనవరి 25) అట్టహాసంగా జరిగింది. మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

త్రివిక్రమ్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ.. హాజరైన కుటుంబ సభ్యులు
Sirivennela Seetharama Sastry Statue

Updated on: Jan 26, 2026 | 6:15 AM

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
తానా సాహిత్య విభాగం, తానా ప్రపంచ సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో అనకాపల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ఆదివారం (జనవరి 25) ఈ విగ్రహావిష్కరణ జరిగింది. మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం పెంటకోట కన్వెన్షన్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మహోత్సవ సభను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గారు మాట్లాడుతూ.. రథసప్తమి రోజున అనకాపల్లి లో పుట్టి అనకాపల్లి లో పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్య వేత్తగా ఒక గేయ రచయితగా అనకాపల్లి కి గౌరవాన్ని తీసుకొచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం గొప్ప విషయం. సిరివెన్నెల తిరిగి న ప్రాంతంలో గాంధీనగర్ లో ఏర్పాటు చేయడం ఎంతో మంచి విషయం. సిరివెన్నెల సీతారామశాస్త్రి కళాపీఠం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ ఏడాది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి చేయడం జరిగింది. విగ్రహ ఏర్పాటుకు తానా ప్రపంచ సాహిత్య వేదిక వారు సహకారం అందించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి కి వెళ్ళినా పుట్టిన ఊరు, పెరిగిన వీధిలో సిరి వెన్నెల విగ్రహ ఆవిష్కరణ అనేది యాదృచికం తో పాటు దైవ సంకల్పం. ప్రతి ఏటా సిరి వెన్నెల కళా పీఠం పేరిట అవార్డ్ ను సాహిత్య వేత్తలకు ఇస్తాం’ అని అన్నారు.

జీవంతో ఉన్నా లేకున్నా మనుషుల మనసుల్లో సజీవం గా నిలిచేది కొందరే అని ప్రముఖ సినీ దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాంటి వారిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకరన్నారు. అనకాపల్లి సిరి వెన్నెల వంటి వారి ఎందరికో పుట్టినిల్లని త్రివిక్రమ్ పేర్కొన్నారు. మహనీయుల చరిత్ర తర్వాత తరాల వారికి తెలియాలన్న, స్పూర్తి పొందాలన్నా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు అవసరమన్నారు. ఏ మనిషిని అయినా తన ఆలోచనలే ఉన్నత స్థితికి తీసుకెళ్తాయన్నారు. మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సాహిత్యాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి సిరి వెన్నెల అన్నారు. మానవీయ విలువలను ప్రతిబింబించేలా ఆయన పాటలు సాగాయన్నారు. సహజముగా దేశభక్తుడు అయిన ఆయన పాటల రూపములో దేశ భక్తిని చాటి చెప్పారన్నారు. కొణతాల సహకారంతోనే ఇది సాధ్యమన్నారు. తానా సభ్యులు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 20 ఏళ్ల టెలిఫోన్ ఉద్యోగం వదిలేసి సినీ ఇండస్రీ లోకి అడుగుపెట్టడం సాహసమే అన్నారు. సిరి వెన్నెల చిత్రం తో తనకంటూ ప్రత్యేకత తో చరిత్ర సృష్టించారన్నారు. వరుసుగా మూడు సినిమాల్లో మూడు నంది అవార్డు లు అందుకున్నారన్నారు.
కార్యక్రమం లో సిరి వెన్నెల కుటుంబ సభ్యులు,బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కూటమి నేతలు పాల్గొన్నారు. కార్యక్రమం లో ఎలాంటి అవాంతరాలు లేకుండా జన సేన ఇంచార్జి రాంకీ ఆధ్వర్యములో ఏర్పాట్ల ను పర్యవేక్షించారు.

 

 

అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ ను, శాస్త్రి గారి కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని శాస్త్రి గారి కుటుంబాన్ని ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి దేవస్థానం వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శింప చేసి వేద పండితులతో ఆశీర్వచనం అందించి సత్కరించారు. అమ్మవారి జ్ఞాపకం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.