ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో తెలియదు కానీ ఆయన కలం నుంచి జాలువారిన పాట మాత్రం మధురామృతమే అవుతుంది. తెలుగుపాటకు సిరివెన్నెలలద్దారాయన. ఆదిభిక్షువు వాడినేమీ కోరేది అంటూ అతని దగ్గర బూడిద తప్ప ఏముందని తొలిసినిమాలోనే వైరాగ్యాన్ని కూడా తన కలంలో పలికించిన సీతారామశాస్త్రి ఇక సెలవంటూ వెళ్లిపోయారు.. సిరివెన్నెలను తనతో పాటే తీసుకెళ్లి తెలుగు సినిమాకు చీకటిని మిగిల్చారు. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందెవేసిన చేయి. నిగ్గదీసి అడుగు అంటూ ఈ సిగ్గులేని జనాన్ని అంటూ జనాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో పాటలు ఆయన కలం నుంచి పురుడు పోసుకున్నాయి.
కళాతపస్వి కె విశ్వనాధ్ అందించిన తొలి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని తెలుగు సినిమా పాటకు కొత్త సొబగులు అద్దారు సీతారామశాస్త్రి. సందర్భం ఎలాంటిదైనా తన సాహిత్యంతో ఆ పాటకు వన్నె తీసుకువచ్చేవారు సిరివెన్నెల.
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా అంటూ ఆయన కలం కదిలితే, నర్తించే పాదంతో పాటు ఈశ్వరుడిని కూడా నాట్యం చేయించేవాడు సిరివెన్నెల.
తన పాటల ప్రయాణానికి వీడ్కోలు పలుకుతూ.. జగమంత కుటుంబం నాదీ ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి పయనమయ్యాడు సిరివెన్నెల.
ఇవి కూడా చదవండి: Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..