సౌత్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాధ్, సింగర్ వాణిజయరాం మరణాలను ఇంకా మరువకముందే.. తెలుగు సినీ నటుడు తారకరత్న మృతి చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది. బెంగుళూరులోని హృదలయ ఆసుపత్రిలో 23 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు తారకరత్న. ఆయన మరణవార్త నుంచి కోలుకునేలోపే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్. మయిల్ స్వామి (57) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు పోరూర్ రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్ల వైద్యులు వెల్లడించారు.
మయిల్ స్వామి తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించారు. ప్రముఖ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. స్టాండప్ కమెడియన్ గా.. టీవీ హోస్ట్ గా థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మయిల్ స్వామి. 1984లో ధవని కనవుగల్ సినిమాతో అరంగేట్రం చేశారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో సుమారు 200 సినిమాలకు పైగా నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులతోపాటు.. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
‘హాస్యనటుడు మయిల్ స్వామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని చాలా బాధేసింది. పార్టీలకు అతీతంగా ఆయన అందరితో స్నేహంగా ఉన్నారు. విరుగంపాక్కం ప్రాంత ప్రజలకు ఎన్నో సామాజిక సేవలు చేశారు. ఎన్నో చిత్రాల్లో తన హాస్యంతో ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని తమిళిసై ట్వీట్ చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.