AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పద్మావత్’ సినిమాలోని ఆత్మార్పణం సీన్‌పై స్వరా భాస్కర్ కామెంట్స్

‘పద్మావత్’ సినిమాలోని ఆత్మార్పణం సన్నివేశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ స్పందించారు. తాను రాణి పద్మావతిని లేదా ఆత్మార్పణం చేసుకున్న మహిళలను ‘పిరికివాళ్లు’ అని అనలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

‘పద్మావత్’ సినిమాలోని ఆత్మార్పణం సీన్‌పై స్వరా భాస్కర్ కామెంట్స్
Swara Bhasker
Ram Naramaneni
|

Updated on: Sep 02, 2026 | 6:18 PM

Share

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ సినిమాల కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా ఫేమస్ అయ్యారు. లెటెస్ట్‌గా ఆమె ‘పద్మావత్’ సినిమాలోని ఆత్మార్పణం సీన్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాణి పద్మావతితో పాటు అగ్నికి ఆహుతైన మహిళలను స్వరా “పిరికివాళ్లు” అన్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వివాదంపై ఆమె స్పందించారు. తన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో వక్రీకరించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని ‘పిరికివారు’ అని అనలేదని, మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదన్నారు. “సినిమాలోని ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు నాకు ఓ ఆలోచన వచ్చింది. అత్యాచారానికి గురై, ప్రాణాలతో బయటపడితే.. ‘నేను ఎందుకు చనిపోలేదు?’ అని కుమిలిపోవాలా?” అని ప్రశ్నించారు. అత్యాచారానికి గురైన మహిళ.. ప్రాణాలతో బయటపడినందుకు తాను ఏదో ఘోరమైన తప్పు చేసినట్టుగా, పిరికిదానిలా భావించే దుస్థితి ఈ సమాజంలో ఉండకూడదనేదే తన అసలు ఉద్దేశమని స్వరా స్పష్టం చేశారు.

అత్యాచారానికి గురైన మహిళకు.. నీ ప్రాణాల కంటే నీ పవిత్రతే ముఖ్యం అనే తప్పుడు సందేశాన్ని ఈ సమాజం ఎప్పటికీ ఇవ్వకూడదు అన్నారు స్వరా. ఒక మహిళ అఘాయిత్యానికి గురైన తర్వాత బతికి బయటపడితే… అక్కడితో ఆమె జీవితం ముగిసిపోయినట్టుగా ఎందుకు చూడాలని ఆమె ప్రశ్నించారు.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావత్ సినిమా విడుదలైనప్పటి నుంచే ఇందులోని చారిత్రక అంశాలు, ముఖ్యంగా ‘ఆత్మార్పణం’ సన్నివేశాలపై చర్చ కొనసాగుతోంది. మహిళలపై దాడులు, వారి గౌరవం, జీవించే హక్కు లాంటి అంశాలను ఈ సన్నివేశాలతో ఎలా చూపించాలన్న దానిపై అప్పటినుంచే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు స్వరా భాస్కర్‌ చేసిన వ్యాఖ్యలు చల్లారిన ఆ వివాదాన్ని మరోసారి రగిలించాయి.

Follow Us