రజనీకాంత్ నటించిన వేటయన్ మొదటి సింగిల్ మనశీలయో పాట లిరిక్స్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దివంగత ప్రముఖ నేపథ్య గాయకుడు మలేషియా వాసుదేవన్ ఈ పాటను పాడారు. 27 ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమా కోసం మలేషియా వాసుదేవన్ స్వరాన్ని వాడారు. మలేషియా వాసుదేవన్ 2011లో కన్నుమూశారు. AI సాంకేతికత సహాయంతో అతని స్వరానికి మళ్లీ ప్రాణం పోశారు. ఈ పాటలో మలయాళం లిరిక్స్ కూడా ఉన్నాయి. ఓనం పండుగ స్పెషల్ గా ఈ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. జై భీమ్ దర్శకుడు టి.ఎస్.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వేటయన్ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఈ పాట ఇప్పుడు విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, తుషార విజయన్, రితికా సింగ్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. జోరుగా సాగుతున్న వేటయన్ సినిమా షూటింగ్ ముంబయిలోని రాజస్థాన్ ఏరియాల్లో జరగ్గా, ప్రస్తుతం ఫైనల్ వర్క్ జరుగుతోంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా యాంటీ ఫేక్ ఎన్‌కౌంటర్ కథాంశంతో ఉంటుందని అంటున్నారు.ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని, సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వేటయన్ లో రజనీకాంత్ ముస్లిం పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లాల్ సలామ్ చిత్రంలో రజనీ ముస్లింగా నటించడం గమనార్హం. ఈ సినిమా చివరి షూటింగ్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో పూర్తయింది. ఇందులో నటుడు రజనీకాంత్ పాల్గొని షూటింగ్ పూర్తి చేసుకుని హిమాలయాలకు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. అనంతరం బద్రీనాథ్, కేదార్‌నాథ్ సహా పలు ప్రాంతాలను సందర్శించారు. అక్టోబరు 10న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వేటయన్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శివ దర్శకత్వంలో సూర్య నటించిన ‘కంగువ’ సినిమా కూడా అదే రోజు విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించడంతో కోలీవుడ్‌లో చాలా నెలల తర్వాత ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. అయితే, రెండు చిత్రాలలో ఒకటి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.