అందానికి సంప్రదాయం తోడైతే కనిపించే రూపమే సౌందర్య (Soundarya ). ఎటువంటి పాత్రనైనా అవలోకగా నటించడం ఆమె ప్రత్యేకత. సహజ సౌందర్యంతో.. పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా దశాబ్దకాలం చక్రం తిప్పింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే సంప్రదాయ చీరకట్టులో నటిస్తూ సహజనటిగా ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రవేసుకుంది. చంద్రబింబం లాంటి మోము.. చారడేసి కళ్ళు.. గులాబి చెక్కిళ్ళు.. చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. సౌందర్య. ఆమె భౌతికంగా దూరమై 18 ఏళ్లు అవుతోంది. అనుహ్యంగా ఈ ప్రపంచం నుంచి మాయమైంది. ఈరోజు (జూలై 18న) సౌందర్య పుట్టినరోజు. ఇప్పటికీ సౌందర్య రూపాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. నిజానికి ఆమె డాక్టర్ కావాలనుకుంది. కానీ అనుకోకుండా వచ్చిన అవకాశంతో వెండితెరకు కథానాయికగా పరిచమయైంది. దీంతో మెడిసిన్ విద్యను మధ్యలోనే వదలేసింది.
జూలై 18న 1972న కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో సౌందర్య జన్మించింది. ఆమె అసలు పేరు సౌమ్య. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సౌందర్యగా పేరు మార్చుకుంది. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా.. ఆమె తండ్రి స్నేహితుడు గంధర్వ (1992) సినిమాలో నటించేందుకు సౌందర్యను ఎంపిక చేశాడు. అలా ఆ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేసింది సౌందర్య. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ మూవీతోనే సౌందర్య క్రేజ్ పెరిగిపోయింది. ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ నుంచి బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ వరకు అందరు అగ్రకథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. నార్త్, సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.
తెలుగులో సౌందర్య ఎక్కువగా విక్టరీ వెంకటేష్ సరసన నటించింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన స్నేహితుడు అయిన జీఎస్ రఘును సౌందర్య 2003 ఏప్రిల్ 27లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది 2004లో లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేసింది. అదే సంవత్సరం ఏప్రిల్ 17న బీజేపీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావుకు మద్దతు తెలిపేందుకు తెలంగాణలోని కరీంనగర్‌కు విమానంలో వస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. టేకాఫ్ అయి 100 అడుగుల ఎత్తుకు చేరుకోగానే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో సౌందర్యతోపాటు ఆమె అన్నయ్య అమర్ నాథ్ కూడా ఉన్నారు. దశాబ్ద కాలంపాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్న సౌందర్య.. భౌతికంగా దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆమె చిత్రాలు మనల్నిని అలరిస్తూనే ఉన్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.