ఆమె.. పాడిన ప్రతి పాటా ఒక అద్భుతమే. ముఖ్యంగా సంగీత ప్రధానమైన మెలొడీలలో ఆమె స్వరం ఒక్కసారి వింటే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే దగ్దర్శకుడు కె. విశ్వనాధ్ తన సినిమాల్లో కచ్చితంగా ఆమెతో చాలా ఇష్టంగా పాదించుకునేవారు. కురిసేను విరిజల్లులే అంటూ ఘర్షణ సినిమాలో మెలోడీతో మైమరిపించినా.. శ్రీ గణనాధం అంటూ శ్రుతిలయలతో అధ్యాత్మికాన్ని పంచినా ఆమె స్వరరాగ మాధుర్యం మన సినిమాకు దక్కిన అదృష్టం. ఇన్ని చెప్పుకుంటూ పోతున్నాం.. ఇంతకీ ఆమె ఎవరో మీకు ఇప్పటికైనా తెలిసిందా? ఈ తరంలో కూడా చాలామందికి ఈ పాటలు బాగా ఇష్టమయినవి అయిఉండవచ్చు. కానీ ఆ మధుర గాయని పేరు ఠక్కున గుర్తు రాకపోవచ్చు. ఆమె పేరు వాణిజయరాం. తెలుగు చిత్రసీమలో టాప్ గాయనీమణులుగా చెప్పుకునే ఎస్. జానకి, సుశీల వంటి వారికి ఏమాత్రం తీసిపోని గాన కోకిల ఆమె. వాస్తవానికి ఆమె పాటలు వింటున్నపుడు మనం కచ్చితంగా ఆ పాటల్లోకి దూరిపోతాం. ఆ స్వర మాధుర్యానికి పరవశించి పోతూనే ఉంటాం.
ఈరోజు అంటే నవంబర్ 30 ఆమె పుట్టినరోజు. ఇప్పుడు ఆమెకు 76 ఏళ్లు. అందుకే ఆమె పాటల ప్రస్థానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకటీ రెండూ కాదు ఏకంగా 19 భాషలలో వాణిజయరాం పాటలు పాడారు. అంటే ఎప్పుడో ఆమె పాన్ ఇండియా సింగర్ అన్నమాట. ఆ భాషల లిస్ట్ కూడా చూడండి.. హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, మార్వారీ, హర్యాన్వి, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిషు, భోజ్‌పురి, రాజస్థానీ, బడగ, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, తుళు. వింటేనే ఆశ్చర్యం వేస్తోంది కదూ. వాణిజయరాం పాడిన ప్రతి పాటా హిట్ అని చెబితే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ, అది నిజం. ఉదాహరణకు కొన్ని పాటలను ఈ సందర్భంగా చెప్పుకుందాం.. పూజ సినిమాలో పూజలు సేయ పూలు తెచ్చాను.. ఆనాటి తరం వారిని మైమరిపించిన పాట. ఇదొక్కటే కాదు ఈ సినిమాలో ఆమె పాడిన పాటలు నాలుగూ ఇప్పటికీ ఆపాత మధురాలుగా వినిపిస్తూనే ఉంటాయి.. నువ్వడిగింది ఏనాడైన కాదన్నానా అంటూ వయసు పిలిచింది సినిమాలో వాణిజయరాం అప్పటి కుర్రకారును ఒక ఊపు ఊపింది. ఇక తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ చిత్రరాజం.. కెవిశ్వనాధ్ శంకరాభరణం సినిమాలో దొరకునా ఇటువంటి సేవా.. ఏ తీరుగ నను దయచూచెదవో.. పలుకే బంగారమాయెనా.. మానస సంచరరె.. బ్రోచేవారెవరురా ఇలా ఆమె పాడిన 5 పాటలు ఎవర్ గ్రీన్ హిట్. ఇప్పటికీ అందరినీ ఆ పాటలు అలరిస్తూనే ఉన్నాయి. అదే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతి కిరణంలో మొత్తం 11 పాటలూ వాణిజయరాం పాడారు. ఆ పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్లిపోతాయి. తెలిమంచు కరిగింది అంటూ పాడినా.. ప్రణతి ప్రణతి ప్రణతి అంటూ ప్రార్ధించినా.. కొండా కోనల్లో లోయల్లో అంటూ హుషారెక్కించినా అది ఒక్క వాణిజయరాంకె చెల్లింది. మణిరత్నం ఘర్షణ సినిమాలో ఒక బృందావనం.. రోజాలో లేత వన్నెలే ఎప్పటికీ మరచిపోలేని పాటలు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ఇక్కడ కేవలం ఆమె పాటలు గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ లిస్ట్ ఇచ్చాం.
తన ఎనిమిదో ఏటనే తొలి కచేరీ ఇచ్చిన వాణిజయరాం 20 వేలకు పైగా సినిమా పాటలు పాడారు. ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ అయితే వేలాదిగా ఉన్నాయి. గాయనిగా మూడు జాతీయ అవార్డులు ఆమె అందుకున్నారు. సీతాకొక చిలుక సినిమాలో ఆమె పాడిన అలలు కలలు ఎగసి సొగసి పోయే అన్నట్టుగానే ఆమె పాటలు కూడా ఒక్కసారి తలుచుకుంటే అలలు అలలుగా మన గుండె చప్పుడుతో కలిసి ఎగసి పడుతూనే ఉంటాయి. పుట్టినరోజు వేళ వాణిజయరాం పాటలను గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు చెబుతోంది టీవీ9.