Actor Nandu: ‘ఆ అమ్మాయి సంపాదిస్తుంటే బతుకున్నాడు అనేవారు..’ ఎమోషనల్ అయిన నందు

నటుడు శ్రీ నందు తన భార్య, గాయని గీతా మాధురితో తరచుగా ఎదుర్కొనే పోలికలపై స్పందించారు. ఒకప్పుడు తనను గీతా మాధురి భర్తగా మాత్రమే గుర్తించేవారని, ఇప్పుడు ఐపీఎల్, ఇతర షోలలో కనిపించడం ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నానని నందు పేర్కొన్నారు. గీతా మాధురి సింప్లిసిటీని కూడా ఆయన వివరించారు.

Actor Nandu: ఆ అమ్మాయి సంపాదిస్తుంటే బతుకున్నాడు అనేవారు.. ఎమోషనల్ అయిన నందు
Nandu - Geetha Madhuri

Updated on: Dec 04, 2025 | 4:29 PM

ప్రముఖ నటుడు శ్రీ నందు ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో తన భార్య, సింగర్ గీతా మాధురితో పోలికలు, తన వ్యక్తిగత గుర్తింపు ప్రయాణం గురించి వివరంగా చర్చించారు. తన సినీ కెరీర్ ప్రారంభంలో  ఆటోనగర్ సూర్య, 100% లవ్ వంటి చిత్రాలలో నటించినప్పటికీ, ప్రజలు తనను గీతా మాధురి భర్తగా లేదా ఆమె రికమండేషన్స్‌తో అవకాశాలు పొందిన నటుడిగా మాత్రమే చూసేవారని నందు గుర్తుచేసుకున్నారు.

“ఒకప్పుడు నేను ఎక్కడికి వెళ్లినా ఈ పోలికలు ఉండేవి. గీత మాధురి మంచి పాటలు పాడిన సింగర్ అని.. నేను ఏదో ప్రయత్నిస్తున్న నటుడు అని అనేవారు” అని నందు గుర్తు చేసుకున్నారు. అయితే, ఈ పోలికలు తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, తమ రిలేషన్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైండ్ సెట్స్ ముందే ప్రిపేర్ చేసుకున్నట్లు వివరించారు. తాను పెళ్లికి ముందు గీతతో ఈ విషయం గురించి మాట్లాడానట్లు చెప్పారు.  “బయట ప్రజలు నన్ను గుర్తుపట్టకపోవచ్చు.. నీతో ఫోటో తీయమని నన్నే అడగవచ్చు..  నాకైతే ఎలాంటి ఇగో లేదు, కానీ నీకు ఇబ్బంది కలుగుతుందా? మన బంధం దెబ్బతింటుందా?” అని అడిగానని నందు తెలిపారు.

గీతా మాధురి సింప్లిసిటీని నందు కొనియాడారు. కోరస్ పాడితే రూ. 3,000 ఇస్తామంటే..  ఆమె ఎంచక్కా వెళ్తుందని చెప్పాడు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కోరస్ కోసం పని చేసి, స్కూటీపై తిరిగి వచ్చేవారని, ఆల్టో కారును కూడా తాను బలవంతం చేస్తే తప్ప కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదని ఆయన వివరించారు. “గీత ఇప్పటికీ కూడా ఒక షోకి ఎంత పెద్ద అమౌంట్ అయినా తీసుకోవచ్చు. అదే సమయంలో కోరస్‌కి పిలిస్తే రూ.3000 తీసుకుని 10 మంది సింగర్స్ పక్కన నిల్చుని కోరస్ పాడి వస్తుంది” అని నందు ఆమె పని పట్ల అంకితభావాన్ని ప్రశంసించారు.

తమ దిల్‍సుఖ్‍నగర్ నివాసం, అక్కడి సాధారణ జీవనం గురించి నందు మాట్లాడుతూ.. “ఫిలిం నగర్ టు దిల్‍సుఖ్‍నగర్ సంబంధమే లేదు. అక్కడ ఎవరూ పట్టించుకోరు. అందరూ చిన్నప్పటి నుంచి చూసినవాళ్ళే కదా. ఏరా నందు ఏంటిరా గ్రౌండ్‌కి రావట్లేదని అడుగుతారు” అని అన్నారు. ఈ సాధారణ వాతావరణం తమను నేల మీద ఉంచుతుందని ఆయన తెలిపారు. కొందరు ఆ అమ్మాయి సంపాదిస్తుంటే బతుకుతున్నాడురా అని ఎత్తిపొడిచేవారని, అయితే తాను ఎనిమిదేళ్లుగా ఐపీఎల్‌లో, అనేక చిత్రాలలో పనిచేశానని, డబ్బు సంపాదించానని నందు బదులిచ్చారు. తన పనికి సరైన గుర్తింపు లభించలేదనే భావనతోనే టెలివిజన్‌లోకి అడుగుపెట్టానని, ఇప్పుడు ఐపీఎల్, టీవీ షోల ద్వారా తనకంటూ ఒక వ్యక్తిగత గుర్తింపును ఏర్పరచుకోవడం పట్ల సంతోషంగా ఉన్నానని ఆయన వివరించారు. ఈ ప్రయాణం తనను ఒక ఇండివిడ్యువల్ టాలెంట్‌గా నిరూపించుకోవడానికి సహాయపడిందని నందు పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .