Sobhan Babu Death Anniversary: సినీ పరిశ్రమలో ఎంట్రీ మొదలు రిటైర్మెంట్ వరకు ప్రతిదీ సంచలనమే..

|

Mar 20, 2021 | 9:20 AM

Sobhan Babu 13th Death Anniversary: తన నటనతోనే కాకుండా.. అందంతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో శోభన్ బాబు. తెలుగువారి

Sobhan Babu Death Anniversary: సినీ పరిశ్రమలో ఎంట్రీ మొదలు రిటైర్మెంట్ వరకు ప్రతిదీ సంచలనమే..
Sobhan Babu
Follow us on

Sobhan Babu 13th Death Anniversary: తన నటనతోనే కాకుండా.. అందంతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో శోభన్ బాబు. తెలుగువారి అందాల నటుడు అంటూ శోభన్ బాబును పిలుచుకునేవారు తెలుగు ప్రేక్షకులు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా.. డీ గ్లామర్ రోల్స్‏లోనూ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఒకప్పుడు వెండితెరపై సోగ్గాడుగా వెలిగిన శోభన్ బాబు మరణించి నేటికి పదమూడు సంవత్సరాలు. ఆ అందాల నటుడుని గుర్తుచేసుకుంటూ.. ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ సోగ్గాడి అసలు పేరు శోబనాచలపతిరావు. ఈయన కృష్ణా జిల్లా నందిగామలో 1937, జనవరి 14న జన్మించారు. సినిమాలంటే ఆయనకు ఎక్కడలేని ఇష్టం. ఎంతలా అంటే మల్లీశ్వరి సినిమాను 20 సార్లు పైగా చూశారంట. దీంతో యాక్టర్ అవ్వాలనుకున్న శోభన్ బాబు.. ‘దైవబలం అనే జానపద’ సినిమాతో వెండితెరపైకి అరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించగా.. శోభన్ బాబు చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమాలో రామానుజుడుగా కనిపించాడు. ఆయన సినీ కెరీర్‏లో ఎక్కువగా ఒక నలుగురైదుగురు డైరెక్టర్స్‏తో సినిమాలు చేశాడు. కె.ఎస్ ప్రకాశరావు, కే.విశ్వనాథ్, బాపు, వి. మధుసుధనరావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు వీళ్లు ఎక్కువగా శోభన్ బాబుతో సినిమాలు రూపొందించేవారు.

తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఉన్న శోభన్ బాబు.. సీతారామకళ్యాణం’, ‘లవకుశ’, ‘నర్తనశాల’ వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు వేశారు. ‘వీరాభిమన్యు’తో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. శోభన్ బాబు హీరోగా చేసిన మొదటి సినిమా లోగుట్టు పెరుమాళ్ళకెరుక.. ఆతర్వాత వచ్చిన బంగారు పంజరం సూపర్ హిట్ గా నిలిచింది. మనుషులు మారాలి సినిమా శోభన్ బాబు కెరీర్‏నే మలుపు తిప్పిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. శోభన్ బాబుకు సినీ పరిశ్రమలు మిత్రులు తక్కువ. అందులో డైరెక్టర్ విశ్వానాథ్ మిక్కిలి స్నేహితుడు. ప్రైవేటు మాస్టారు చిత్రంతో ప్రారంభమైన వీరిద్దరి ప్రయాణం నిండు హృదయాలు, చిన్న నాటి స్నేహితులు, శారద, జీవనజ్యోతి, జీవిత నౌక, కాలాంతకులు, చెల్లెలి కాపురం ఇలా కొనసాగింది. శోభన్ బాబు గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు. డీ గ్లామర్ రోల్స్ నూ అద్భుతంగా చేసి మెప్పించగలడని నిరూపించిన చెల్లెలి కాపురం విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నదే. శోభన్ బాబు తో ప్రత్యేక అనుబంధం ఉన్న మరో దర్శకుడు దాసరి నారాయణరావు. వీరి కాంబినేషన్‏లో వచ్చిన తొలి చిత్రం బలిపీఠం. చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి,అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబును తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మలి చిత్రం గోరింటాకు. తర్వాత స్వయంవరం వంటి మెమరబుల్ సినిమాలు చాలానే ఉన్నాయి. శోభన్ బాబు సినిమాల్లో ఏవండీ ఆవిడోచ్చింది, కార్తీక దీపం వంటి సినిమాలు మహిళా ప్రేక్షకులను మెప్పించాయి. ఆ తర్వాత మానవుడు-దానవుడు సినిమాతో తనలోని మాస్ క్యారెక్టర్‏ను బయటకు తీశాడు. ఆ తర్వాత ‘జగజ్జెట్టీలు’, ‘అడవిరాజు’, ‘కాళిదాసు’, ’ప్రతీకారం’ సినిమాలతో మాస్‌లోనూ మంచి ఇమేజ్ సాధించారు. ఎలాంటి పాత్రలలోనైనా ఒదికిపోయే శోభన్ బాబు.. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో రాముడిగా నటించి మెప్పించారు. అంతేకాకుండా.. ‘కురుక్షేత్రం’లో కృష్ణుడి పాత్రలో కూడా మెప్పించారు. తర్వాత సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన ‘ధర్మపీఠం దద్దరిల్లింది’, ‘దేవాలయం’ సినిమాలు నటుడిగా శోభన్‌ బాబుకు మంచి పేరు తీసుకొచ్చాయి.తన యాక్టింగ్ స్కిల్స్ తో అనేక అవార్డులూ రివార్డులూ అందుకున్నారు శోభన్ బాబు. శోభన్ బాబు తన ముప్పైఏళ్ల కెరీర్ లో మొత్తం 228 సినిమాల్లో యాక్ట్ చేశారు. 96లో రిలీజైన ‘హలోగురు’తో నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. అప్పటి వరకూ ఏ నటుడూ పాటించని రిటైర్మెంట్ ప్రకటించారు. ఐదుసార్లు నంది అవార్డులు, వరుసగా మూడు ఫిలింఫేర్లు అందుకుని రికార్డు క్రియేట్ చేశారు. 2008 మార్చి 20 న చెన్నైలో కన్నుమూశారు శోభన్ బాబు. ఆయన లేకున్నా ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి.

Also Read:

బిగ్‏బాస్ బ్యూటీకి కరోనా పాజిటివ్.. తనతో ఉన్నవారందరూ టేస్ట్ చేయించుకోవాలంటూ ట్వీట్..

ఒకే ఫ్రేమ్‏లో చిరు, పవన్, రామ్ చరణ్.. మెగా అభిమానులకు బిగ్ సర్‏ఫ్రైజ్ ఇవ్వనున్న మేకర్స్..