Oke Oka Jeevitham: శర్వానంద్‌ని ఈ మధ్య వరుసగా ఫ్లాపులే పలకరించాయి. మంచి ఆర్టిస్ట్. వెరైటీ సబ్జెక్టులను సెలక్ట్ చేసుకుంటారు. అయినా ఫ్లాప్‌లెందుకు వస్తున్నాయ్? ఒక్క హిట్ పడితే బౌన్స్ బ్యాక్ అవుతారు అని అనుకున్నవారు కోకొల్లలు. శతమానం భవతి తర్వాత మహానుభావుడు ఫర్వాలేదనిపించింది. అయితే శతమానంభవతి స్థాయి పేరు తెచ్చిపెట్టే సినిమా శర్వా కెరీర్‌లో పడలేదు. మరి జనాలు కోరుకున్న విజయం ఒకే ఒక జీవితంతో సాధ్యమైందా? చదివేయండి
సినిమా: ఒకే ఒక జీవితం
నటీనటులు: శర్వానంద్, రీతు వర్మ, అమలా అక్కినేని, నాజర్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అలీ, మధునందన్, రవి రాఘవేంద్ర, యోగ్ జేపీ, జై ఆదిత్య, హితేష్, నిత్యరాజ్‌తదితరులు
సంగీతం: జేక్స్ బిజాయ్
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
ఆర్ట్: ఎన్.సతీష్‌కుమార్
మాటలు: తరుణ్ భాస్కర్
దర్శకత్వం: శ్రీ కార్తిక్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు
సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
విడుదల: సెప్టెంబర్9, 2022
ఆది (శర్వానంద్) ఇంట్రోవర్ట్. సన్నిహితుల మధ్య సరదాగా ఉండే ఆది, కొత్తవాళ్ల ముందు నోరు విప్పడానికి తడబడుతాడు. పెద్ద గాయకుడు కావాలన్నది అతని కల. గిటార్ వాయిస్తూ పాడుతుంటాడు. కానీ పోటీల్లో పాడాలంటే భయపడుతాడు. 20 ఏళ్ల క్రితం తన తల్లి (అమల) చనిపోయినప్పటి నుంచి మరీ ఒంటరివాడిలా ఫీలవుతుంటాడు. అతన్ని ఇష్టపడుతుంది వైషు అలియాస్ వైష్ణవి (రీతువర్మ). ఎలాగైనా అతనిలోని భయాన్ని పోగొట్టి పెద్ద గాయకుడిగా చూడాలన్నది ఆమె కల. ఆది చిన్ననాటి స్నేహితులు శీను, చైతూ. చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకోకపోవడంతో శీను ఇళ్ల బ్రోకర్‌గా మారుతాడు. అమ్మాయిల్లో ఎప్పుడూ ఏదో వంక వెతికే చైతూకి ఎంతకీ పెళ్లి కాదు. ఇలా సాగుతున్న వారి జీవితంలోకి సైంటిస్ట్ పాల్ (నాజర్) ఎంటర్ అవుతాడు. పాల్ రూమ్‌లో 1998 మార్చి 28 అని ఓ అట్టపెట్టె కనిపిస్తుంది. దానికీ, ఆది జీవితంలో జరిగిన ఓ ఘటనకీ లింకు ఉంటుంది. గతంలో జరిగిన ఆ ఘటనను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తానని పాల్ ఊరిస్తాడు. అమ్మను కలిసే అవకాశం వస్తుందనుకున్న ఆది సరేనంటాడు. అతనితోపాటు శీను, చైతూ కూడా ట్రావెల్ చేస్తారు. వాళ్లు అనుకున్నది జరిగిందా? లేదా? 20 ఏళ్లు వెనక్కి వెళ్లి ఆముగ్గురూ తమ బాల్యంలో మార్చాలనుకున్న విషయాలేంటి.? వాటి వల్ల వాళ్లకు కలిగిన కన్‌ఫ్యూజన్ ఏంటి? వారి భవిష్యత్తు మారిందా? లేదా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
సిల్వర్ స్క్రీన్ మీద క్రేజ్ ఉన్న సబ్జెక్టుల్లో టైమ్ ట్రావెల్ ఎప్పుడూ ఉంటుంది. ఆదిత్య 369 కావచ్చు, ఇప్పుడు సెట్స్ మీదున్న ప్రాజెక్ట్ కె కావచ్చు, సినిమాలో టైమ్ ట్రావెల్ ఉంటుందంటే అదో ఫాంటసీ ఫీల్. ఒకే ఒక జీవితం కూడా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో డిజైన్ అయిందే. నలుగురితో కలవలేని కొడుకు, అతన్ని సపోర్ట్ చేసే అమ్మ, గుండెల నిండా ప్రేమ ఉన్నా పైకి కటువుగా కనిపించే నాన్న, చదువురాని శీను, సరదాగా ఉండే చైతూ… ఇలాంటి కేరక్టర్ల చుట్టూ తిరుగుతుంది.
టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్‌ని పూర్తిగా టెక్నికల్‌గా అర్థం కాని భాషలో డంప్ చేయకుండా, ప్రతి సన్నివేశాన్ని సరదాగా తీర్చిదిద్దారు డైరక్టర్. చిన్ననాటి తమను కలుసుకునే ముగ్గురు యువకులు, వారి జీవితాలను మార్చడానికి వీరు పడే తపన, ఆ ఫ్రస్ట్రేషన్‌లో అనే మాటలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఎవరూ ఊహించనిదే.
అమల చాన్నాళ్ల తర్వాత నటించిన సినిమా. ఇంట్రోవర్ట్ కొడుకును తీర్చిదిద్దే తల్లి కేరక్టర్‌కి సూటయ్యారు. 20 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న తల్లి మళ్లీ కళ్ల ముందు కదులుతుంటే అపురూపంగా, అబ్బురపడిపోయే చూసుకునే కొడుకు కుట్లుగా శర్వానంద్ తనలోని నటుడితో మెప్పించారు. ప్రియదర్శి, వెన్నెలకిశోర్ కామెడీ టైమింగ్‌కి ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే.
అన్నిటికన్నా ముందు మెన్షన్ చేయాల్సింది తరుణ్ భాస్కర్ రైటింగ్. తరుణ్ డైలాగులు నేచురల్‌గా ఉన్నాయి. స్క్రీన్‌ప్లేను సింప్లిఫై చేశాయి.
ఆది ఐ బాల్ మ్యాచ్ చేస్తే అతని ఫ్రెండ్స్ ఎలా టైమ్ ట్రావెల్ చేశారు? చుట్టూ ఉన్నవారు కూడా గతంలోకి వెళ్లొచ్చని అనుకుంటే, మరి ఫస్ట్ టైమ్ పాల్, సెకండ్ టైమ్ వైషూ ఎందుకు వారి వారి గతాల్లోకి వెళ్లలేకపోయారు? వంటి అనుమానాలు కూడా వస్తాయి.
మరీ లాజిక్కులు వెతక్కుండా సరదాగా సినిమా చూడాలనుకుంటే నచ్చుతుంది. ఆల్రెడీ ఇలాంటి వెబ్‌సీరీస్‌లు, హాలీవుడ్ సినిమాలూ చూసేసిన వారు మాత్రం వాటితో పోల్చుకుంటూ పెద్దగా ఎంజాయ్ చేయలేరు. బ్లాంక్ మైండ్‌తో వెళ్లిన వారు థ్రిల్ ఫీలవుతారు.
నటీనటుల పనితీరుతో పాటు, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, కెమెరా పనితనాన్ని కూడా స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సిందే. విధిని గెలవాలనుకోవడం, గతాన్ని మార్చాలనుకోవడం కన్నా ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ, ఆనందంగా ముందుకు సాగడమే మానవాళి ముందున్న లక్ష్యం అని చెప్పే సినిమా ఒకే ఒక జీవితం.
– డా. చల్లా భాగ్యలక్ష్మి