సీనియర్ నటుడు.. తన విలక్షణ నటనతో సుదీర్ఘకాలం ప్రేక్షకుల మదిని మెప్పించిన శరత్ బాబు అంత్యక్రియలు అభిమానులు, సహచరుల మధ్య చెన్నైలో ముగిశాయి. శరత్‌బాబుకి కుటుంబ సభ్యులు, మిత్రులు, సినీ సహచరులు, అభిమానులు అశ్రునివాళులు అర్పించారు. 250కి పైగా చిత్రాల్లో.. తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిని దోచిన శరత్‌కాల చంద్రుడు ఇక కనిపించడన్న వార్త అభిమానులను కంటతడిపెట్టించింది. అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించారు. శరత్‌బాబు సహ నటులు, ఆయన అభిమానులు చెన్నై, టీనగర్‌లోని శరత్‌బాబు నివాసానికి వచ్చి, ఆయన భౌతిక కాయానికి నివాళ్ళర్పించారు. శరత్‌బాబుకి అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ప్రముఖ హీరో రజనీకాంత్ శరత్‌బాబు భౌతిక కాయాన్ని సందర్శించి తన సహచరుడికి నివాళ్ళర్పించారు. శరత్‌బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను సిగరెట్ తాగుతుంటే శరత్‌బాబు వారించేవారని, నోట్లో సిగరెట్ తీసి పడేసేవాడనీ, ఆయన మొహంలో కోపాన్ని చూసి ఎరుగనని వ్యాఖ్యానించారు రజనీకాంత్. రాధిక, శరత్‌కుమార్ సహా పలువురు సినీ ప్రముఖులు శరత్‌బాబు భౌతిక కాయానికి నివాళ్ళర్పించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శరత్ బాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసికొని భావోద్వేగానికి గురయ్యారు. శరత్‌బాబు అంత్యక్రియల ఏర్పాట్లను నటి సుహాసిని దగ్గరుండి పర్యవేక్షించారు. శరత్‌బాబుతో తన అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.
సత్యంబాబు దీక్షితులుగా మారిన శరత్‌బాబు…తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు. బహుభాషా ప్రాంతాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో శరత్‌బాబుని కడసారి వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చారు. శరత్‌బాబు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఇటు హీరోగా, అటు విలన్‌గా, మరోవైపు భగ్నప్రేమికుడిగా…పలు పాత్రల్లో జీవించిన శరత్‌బాబు మృత్యువు కౌగిట్లో ఒదిగిపోయారు. 1973లో రామరాజ్యం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో చివరిసారిగా తెరపై కనిపించారు శరత్‌బాబు. శరత్‌బాబు ఇక కనిపించరన్న భావన ఇటు కుటుంబాన్నీ, అటు అభిమానులను కంటతడిపెట్టిస్తోంది. అయితే తెలుగు సినీపరిశ్రమలో తనదైన స్థానాన్ని నిలుపుకున్న శరత్ బాబు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు.