Chalapathi Rao Death : నటుడు చలపతిరావు పార్దివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు.. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ భావోద్వేగం..

| Edited By: Rajeev Rayala

Dec 25, 2022 | 3:56 PM

తాజాగా మరో సీనియర్ నటుడు చలపతి రావు హఠాన్మరణంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఆదివారం (డిసెంబర్ 25న) తెల్లవారుజామున గుండెపోటుతో తన కుమారుడు రవిబాబు నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. చలపతి రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

Chalapathi Rao Death : నటుడు చలపతిరావు పార్దివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు.. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ భావోద్వేగం..
Chalapathi Rao Death

టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత నాలుగు నెలల్లో నలుగురు దిగ్గజ నటులు మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ కన్నుమూయగా..తాజాగా మరో సీనియర్ నటుడు చలపతి రావు హఠాన్మరణంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఆదివారం (డిసెంబర్ 25న) తెల్లవారుజామున గుండెపోటుతో తన కుమారుడు రవిబాబు నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. చలపతి రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Dec 2022 02:26 PM (IST)

    ఎప్పుడు నవ్వుతూ.. నవ్విస్తూ ఉండేవారు: భానుచందర్

    చలపతిరావు గారు చాలా గొప్ప మనిషి. ఆయన ఎప్పుడు నవ్వుతూ.. నవ్విస్తూ ఉండేవారు అన్నారు భానుచందర్. ఆయన మరో నటుడు భర్తీ చేయలేరు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు భానుచందర్

  • 25 Dec 2022 02:23 PM (IST)

    నిజజీవితంలో ఎంతో మంచి మనిషి: తరుణ్

    ఒక గొప్ప నటుడిని కోల్పోయామని అన్నారు హీరో తరుణ్. ఆయన ఎంతో మంచి వారు.. సినిమాల్లో విలన్ పాత్రలు చేసినా నిజజీవితంలో ఎంతో మంచి మనిషి. చాలా సరదాగా ఉంటారు . ఆయన మరణం కలిచివేసింది అని అన్నారు తరుణ్

  • 25 Dec 2022 02:21 PM (IST)

    ఆ సమయంలో చాలా ఏడ్చేశారు : కరాటే కళ్యాణి

    చలపతి రావు గారి మరణం కలిచివేసింది. మా ఎలక్షన్స్ సమయంలో వచ్చి ఆయన ఏడ్చేశారని అన్నారు కరాటే కళ్యాణి. మా ఎలక్షన్స్ సమయంలో వీల్ చైర్ పై వచ్చి ఓటు వేశారు. మళ్లీ వస్తానో రానో మిమ్మల్ని కలుస్తానో లేదో అంటూ ఏడ్చేశారు అని అన్నారు కరాటే కళ్యాణి.

  • 25 Dec 2022 02:14 PM (IST)

    ఫ్యామిలీ, సినిమా తప్ప వేరేది తెలియదు : చిరంజీవి

    ఆయన వేసే వేషాలు, ఆయన వేసే జోకులకు.. వ్యక్తిగత విషయాలకు సంబంధం ఉండేది కాదు. టీ కాఫీలు కూడా తాగేవారు కాదు.. చాలా ఆరోగ్యంగా ఉంటారు.. కానీ ఇలా ఆయన అకాల మరణం కలిచివేసింది అని అన్నారు చిరంజీవి. ఆయనకు తన ఫ్యామిలీ, సినిమా తప్ప వేరేది తెలియదు చలపతిరావు గారికి అన్నారు చిరు.

  • 25 Dec 2022 02:11 PM (IST)

    రవిబాబుకి ఎన్టీఆర్ వీడియో కాల్

    చలపతిరావు తనయుడు రవిబాబుకి వీడియో కాల్ చేసి మాట్లాడిన ఎన్టీఆర్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న తారక్

  • 25 Dec 2022 01:45 PM (IST)

    చలపతిరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం..

    ప్రముఖ నటుడు చలపతిరావు మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. చలపతిరావు మరణం సినీరంగానికి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు వెండితెరపై నటుడు చలపతిరావు తనదైన ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు.

  • 25 Dec 2022 01:30 PM (IST)

    మంచి మిత్రుడిని కోల్పోయాను.. చిరంజీవి ఎమోషనల్..

    నటుడు చలపతిరావు తనకు మంచి మిత్రుడని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మద్రాసులో ఉన్ననాటి నుంచి తనకు ఆయనతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. చలపతిరావు భౌతికకాయానికి చిరంజీవి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  • 25 Dec 2022 01:18 PM (IST)

    చలపతిరావు ప్రేమకథనే సినిమాగా తీసిన ఈవీవీ..

    ఈవీవీ తీసిన ‘మా నాన్నకు పెళ్లి’ సినిమా కథ నా లవ్​ స్టోరీనే అంటూ గతంలో అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చారు సీనియర్ చలపతిరావు. తన ప్రేమ, పెళ్లి విషయాలనే ఆధారంగా చేసుకుని ఆ సినిమాను రూపొందించారని తెలిపారు.

  • 25 Dec 2022 01:06 PM (IST)

    చలపతిరావు పార్ధివదేహానికి తరుణ్ నివాళులు…

    చలపతిరావు మరణించడం తెలుగు సినిమాకు బాధాకరమైన రోజని అన్నారు తరుణ్. తన మొదటి సినిమాలో చలపతిరావుగారితో కలిసి నటించానని.. ఎంతో క్లోజ్ బాండ్ ఉండేదని అన్నారు.

  • 25 Dec 2022 01:00 PM (IST)

    చలపతిరావు పార్ధివదేహానికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి…

    మెగాస్టార్ చిరంజీవి సీనియర్ నటుడు చలపతిరావు పార్ధివదేహానికి నివాళుల్పరించారు. బంజారాహిల్స్ లోని నటుడు రవిబాబు ఇంటికి చేరుకుని.. ఆయనను ఓదార్చారు.

  • 25 Dec 2022 12:54 PM (IST)

    చలపతిరావు పార్ధివదేహానికి సహనటి దిల్లీ రాజేశ్వరి నివాళులు..

    ఆయన నాకొక ఆప్తమిత్రుడు మంచి మనిషి. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. ఈ మధ్యే ఆయనతో మాట్లాడాను. త్వరలోనే కలుద్ధాం అనుకున్నాం. ఇంతలోనే ఇలా జరగడం నాకెంతో బాధగా ఉంది. లెజెండ్స్ అందరూ ఇలా వెళ్లిపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. అన్నారు దిల్లీ రాజేశ్వరీ.

  • 25 Dec 2022 12:52 PM (IST)

    చలపతిరావుకు ఎస్వీ కృష్ణారెడ్డి నివాళులు..

    పాత్ర ఏదైనా సరే ఆయన అందులో ఒదిగిపోయేవారు చలపతిరావు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి..

  • 25 Dec 2022 12:48 PM (IST)

    చలపతిరావు మృతిపట్ల సుదీర్ బాబు సంతాపం..

    తెలుగు సినీపరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో కష్టతరమైనది. చలపతిరావు గారికి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.

  • 25 Dec 2022 12:26 PM (IST)

    ఎఎలాంటి నొప్పి లేకుండా..ప్రశాంతంగా వెళ్లిపోయారు.. చలపతిరావు కుమారుడు రవిబాబు..

    ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు నాన్నను బాబాయ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారని.. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ ఉండేవారని..అందుకేనేమో ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారని అన్నారు చలపతిరావు కుమారుడు రవిబాబు. రాత్రి భోజనం చేసేవరకు బాగానే ఉన్నారని.. చికెన్ కూర తిని ఆ ప్లేట్ అలా ఇచ్చి వెనక్కి వాలిపోయారని.. ఎంతో ప్రశాంతంగా వెళ్లిపోయారని అన్నారు.

  • 25 Dec 2022 12:09 PM (IST)

    మంచి స్నేహితుడిని కోల్పోయాను.. నిర్మాత సురేష్ బాబు..

    నటుడు చలపతిరావు మరణ వార్త ఎంతో బాధకరమన్నారు నిర్మాత సురేష్ బాబు. ఇండస్ట్రీలో అందరిపై జోక్స్ వేస్తూ.. ఎంతో సంతోషంగా ఉండేవారని.. తనకు మంచి స్నేహితుడని.. గత రెండు మూడు రోజుల క్రితం రవిబాబు రూపొందిస్తున్న సినిమాలో చిన్న రోల్ వేశారని.. ఇలా అకాల మరణం చెందడం బాధగా ఉందన్నారు. ఆయన కూతుర్లు వచ్చకా..బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

  • 25 Dec 2022 12:06 PM (IST)

    సత్యన్న వెనకే పయణమైన చలపాయ్..

    కైకాల సత్యనారాయణ మరణవార్త విన్న చలపతిరావు.. భావోద్వేగా ట్వీట్ చేశఆరు. నువ్వు కూడా వెళ్లిపోయావా సత్యన్నా .. అంటూ తన అభిమాన హీరో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేశారు. అయితే ట్వీట్ చేసి 48 గంటలు గడవకముందే చలపతిరావు గుండెపోటుతో కన్నుమూశారు.

  • 25 Dec 2022 11:58 AM (IST)

    కష్టం ప్రతిసారి వచ్చేది.. కానీ కన్నీళ్లు రాలేదు.. చలపతిరావు..

    తన జీవితంలో ఎప్పటికప్పుడు కష్టం వచ్చేదని.. కానీ కన్నీళ్లు మాత్రం రాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నటుడు చలపతి రావు. ముగ్గురు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తన భార్య మరణించడం.. ఆ తర్వాత చేతివరకు వచ్చిన అవకాశాలు వెళ్లిపోవడంతో ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు చలపతిరావు.

  • 25 Dec 2022 11:46 AM (IST)

    చలపతిరావు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి..

    సీనియర్ నటుడు చలపతిరావు పార్థివదేహానికి నిర్మాత సురేష్ బాబు నివాళులర్పించారు. అలాగే నటుడు కాశీ విశ్వనాథ్, డైరెక్టర్ ఎస్వీ కృష్ణరెడ్డి, అచ్చిరెడ్డి, నందమూరి రామకృష్ణ నివాళులర్పించారు.

  • 25 Dec 2022 11:29 AM (IST)

    తెలుగు సినిమాకు ఈ ఏడాది భయంకరం.. సాయి ధరమ్ తేజ్..

    సీనియర్ నటుడు చలపతిరావు మరణంపట్ల యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ఈ ఏడాది తెలుగు సినిమాకు చాలా భయంకరమైనదని.. ఇండస్ట్రీ మరో దిగ్గజ నటుడిని కోల్పోయిందని అన్నారు. చలపతిరావు గారిని కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉందని.. రవిబాబు గారికి, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

  • 25 Dec 2022 11:22 AM (IST)

    సూసైడ్ చేసుకోవాలనుకున్న చలపతిరావు.. ఎందుకంటే..

    తన గురించి సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చూసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట సీనియర్ నటుడు చలపతిరావు. స్త్రీల గురించి నవ్వుతూ ఆయన చేసిన కామెంట్ పై మహిళలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే తన గురించి నెట్టింట్లో వచ్చిన కామెంట్స్ చూసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట చలపతి రావు. గతంలో అలీతో సరదాగా షోలో పాల్గొన్న ఆయన తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మహిళలను తాను ఏదో అన్నానని.. సోషల్ మీడియాలో తనపై దారుణంగా కామెంట్స్ చేశారని ఆయన చెప్పారు. తను అన్నది వేరు.. వాళ్లు కల్పించింది వేరని.. ఆడవాళ్లను తాను చాలా గౌరవిస్తానని.. 22 ఏళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదని.. ఇండస్ట్రీలోని మహిళలు ఏనాడు ఒక్క మాట కూడా అనలేదని.. అలాంటి తనను అల్లరి చేశారని.. ఆసమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు. మీ అందరికీ రుణపడి ఉంటాను ఆని సూసైడ్ నోట్ రాసిపెట్టాలనుకున్నారట. సోషల్ మీడియా అనే దరిద్రం తనకున్న మంచి పేరును చెడగొట్టిందని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

  • 25 Dec 2022 11:21 AM (IST)

    రవిబాబుకు ఎన్టీఆర్ వీడియో కాల్.. కన్నీటిపర్యంతమైన తారక్..

    సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణం పట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన అక్కడి నుంచి చలపతిరావు కుమారుడు రవిబాబుకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. మీరు మరణించారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని.. బాబాయ్ లే అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తతుం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

  • 25 Dec 2022 11:16 AM (IST)

    చలపతిరావు మరణం నన్ను కలచివేసింది.. జూనియర్ ఎన్టీఆర్..

    “చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన.” అంటూ ట్వీట్ చేశారు తారక్..

  • 25 Dec 2022 11:16 AM (IST)

    చలపతిరావు గారి మరణవార్త విని షాకయ్యాను.. డైరెక్టర్ అనిల్ రావిపూడి..

    చలపతిరావు బాబాయి మరణవార్త విని షాకయ్యాను. ఇక ఆయన లేరు అనే వార్త మరింత దిగ్ర్భాంతికి గురి చేసింది. రవిబాబు గారికి మరియు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను..అంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

  • 25 Dec 2022 11:11 AM (IST)

    చలపతిరావు మృతిపట్ల డైరెక్టర్ గోపిచంద్ మలినేని సంతాపం..

    ” తెలుగు చిత్రపరిశ్రమ మరో దిగ్గజ నటుడిని కోల్పోయాం. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబానికి మరింత బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు .

  • 25 Dec 2022 11:05 AM (IST)

    చలపతిరావు మరణంపై ఏపీ మంత్రి రోజా సెల్వమణి ఎమోషనల్..

    ” సీనియర్ నటులు చలపతి రావు గారు వెండితెరపై నెగటివ్ రోల్ లో ఎక్కువగా కనిపించినా నిజజీవితంలో చాలా పాజిటివ్ మనిషి వారి మరణం చిత్రపరిశ్రమకి తీరనిలోటు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాను ” అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు ఏపీ మంత్రి రోజా సెల్వమణి.

  • 25 Dec 2022 11:01 AM (IST)

    చలపతిరావు మృతిపట్ల డైరెక్టర్ బాబీ ఎమోషనల్ ట్వీట్..

    ” చలపతిరావు గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన దయగల వ్యక్తి..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో రవిబాబు గారికి ఆయన కుటుంబ సభ్యులకు బలం చేకూరాలని కోరకుంటున్నాను.” అంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ బాబీ.

  • 25 Dec 2022 10:58 AM (IST)

    చలపతిరావు మృతిపట్ల కళ్యాణ్ రామ్ సంతాపం..

    “చలపతిరావు బాబాయి అంటే నాకు ఒక వ్యక్తిగా, నా కుటుంబానికి కూడా చాలా ఇష్టం. ఆయన ఆకస్మిక మరణం మా కుటుంబం మొత్తాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నష్టాన్ని పదాలలో వివరించలేవు. ఆయన కుటుంబానికి ఈ బాధను అధిగమించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు కళ్యాణ్ రామ్.

  • 25 Dec 2022 10:48 AM (IST)

    చలపతిరావు మరణం నన్ను కలచివేసింది.. చిరంజీవి..

    “విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి” అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

  • 25 Dec 2022 10:43 AM (IST)

    చలపతిరావు అంత్యక్రియలపై రవిబాబు స్పందన..

    సీనియర్ నటుడు చలపతిరావు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారని ఆయన కుమారు రవిబాబు అన్నారు. ఆయన కుమార్తె అమెరికా నుంచి మంగళవారం ఉదయం వరకు వస్తారని.. బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భౌతికకాయాన్ని తన కుమారుడు రవిబాబు ఇంట్లోనే అభిమానుల సందర్శన కోసం ఉండనుంది. ఆ తర్వాత ఆయన పార్ధీవదేహాన్ని ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచడం జరుగుతుందన్నారు.

  • 25 Dec 2022 10:21 AM (IST)

    చలపతిరావు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు.. నటుడు కాశీవిశ్వనాథ్.

    చలపతిరావు మృతి తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి తీరని లోటన్నారు నటుడు, డైరెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌. రీసెంట్‌గా నాలుగురోజుల క్రితం రవిబాబు డైరెక్షన్‌ చేసే మూవీలో చలపతిరావు చిన్న రోల్‌ చేశారన్నారాయన.

  • 25 Dec 2022 10:07 AM (IST)

    చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది.. బాలకృష్ణ

    “చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. చలపతిరావు గారు తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో చలపతిరావు గారికి అవినాభావ సంబంధం వుంది. నాన్నగారితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు నందమూరి బాలకృష్ణ

  • 25 Dec 2022 10:00 AM (IST)

    చలపతిరావు పట్ల నారా లోకేష్ సంతాపం..

    “సీనియర్ నటుడు, నిర్మాత చలపతిరావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. 1200 కు పైగా సినిమాల్లో నటించి ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి”. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

  • 25 Dec 2022 09:52 AM (IST)

    చలపతిరావు మృతి పట్ల బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సంతాపం..

    బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి చలపతిరావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చలపతిరావు మృతి ఇండస్ట్రీకి తీరని లోటని వివేక్ అభిప్రాయపడ్డారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.

  • 25 Dec 2022 09:51 AM (IST)

    చలపతిరావు స్వగ్రామంలో విషాదఛాయలు..

    సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పామర్రు మండలం బలిపర్రు. కుటుంబ సభ్యులతో కలిసి తరచూ స్వగ్రామం వచ్చేవారు. బలిపర్రు అభివృద్ధికి జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. ఓకే మండలానికి చెందిన వారు కావడంతో ఎన్టీఆర్ తో, చలపతిరావుకు సన్నిహిత అనుబంధం ఉండేది. నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తుడు చలపతిరావు.

  • 25 Dec 2022 09:30 AM (IST)

    చలపతిరావు సినీ ప్రస్థానం..

    1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమతో సినీరంగ ప్రవేశం చేసిన చలపతి రావు.. దాదాపు 1200లకు పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాదు.. నిర్మాతగానూ గుర్తింపు పొందారు. ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా.. సహయ నటుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కలియుక కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, అక్బర్ సలీమ్ అనార్కలి, భలే కృష్ణుడు, సరదా రాముడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, చట్టంతో పోరాటం, అల్లరి రాముడు, అల్లరి, నిన్నే పెళ్లాడతా, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్ ఇలా ఎన్నో వందల సినిమాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున తండ్రిగా కనిపించడం ఆయన కెరీర్ ను మలుపుతిప్పిందనే చెప్పుకోవాలి.

  • 25 Dec 2022 09:17 AM (IST)

    ఎన్టీఆర్‏తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం..

    మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు‏తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. 19 ఏళ్లకే ఇందుమతి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు చలపతిరావు. ఎన్టీఆర్ సాయంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆయన తొలి సినిమా కథానాయకుడు ఎన్టీఆర్ హీరో. 22ఏళ్లకే తన భార్య అనారోగ్యంతో మరణించిన మళ్లీ పెళ్లిచేసుకోకుండా.. ముగ్గురు పిల్లల్ని ఏ కష్టం రాకుండా చూసుకున్నారు చలపతి రావు. మళ్లీ పెళ్లి చేసుకోమని ఎన్టీఆర్ భార్య తారకమ్మ సూచించిన.. వచ్చే భార్య తన పిల్లల్ని ఎలా చూస్తుందో అని భయపడి మళ్లీ పెళ్లి చేసుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చలపతిరావు.

  • 25 Dec 2022 09:09 AM (IST)

    చలపతిరావు అంత్యక్రియలు..

    చలపతిరావు కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

  • 25 Dec 2022 09:06 AM (IST)

    చలపతి రావు జీవితం..

    1944 మే8న కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో చలపతి రావు జన్మించారు. ఆయనకు కుమారుడు రవి బాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాటకాల్లో రాణించిన ఆయన, సినిమాపై మక్కువతో అనేక విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించారు. 90వ దశకంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య వంటి అగ్రహీరోలతో నటించారు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చలపతి రావు.. దాదాపు 1200లకు పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాదు.. నిర్మాతగానూ గుర్తింపు పొందారు. ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా.. సహాయ నటుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

  • 25 Dec 2022 09:03 AM (IST)

    చలపతిరావు మృతిపట్ల చంద్రబాబు నాయుడు సంతాపం..

    ‘ప్రముఖ నటులు చలపతిరావు గారి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. టాలీవుడ్ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం విషాదకరం. 1000కు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు మృతి సినీ రంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సోషల్‌ మీడియా వేదికగా చలపతిరావుకు నివాళి అర్పించారు చంద్రబాబు.

  • 25 Dec 2022 09:00 AM (IST)

    చలపతిరావు మరణంపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం..

    “ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ చలపతిరావు గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను”.అంటూ ట్వీట్ చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

  • 25 Dec 2022 08:57 AM (IST)

    చలపతిరావు మృతిపట్ల పవన్ కళ్యాణ్ సంతాపం..

    “ప్రముఖ నటులు చలపతిరావు గారు కన్నుమూయడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనను చూపించారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. చలపతిరావు గారి కుమారుడు నటుడు, దర్శకుడు రవిబాబు గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరం”. అన్నారు పవన్ కళ్యాణ్.

  • 25 Dec 2022 08:53 AM (IST)

    సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మారణం..

    సీనయిర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణం మరువక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు ఆప్యాయంగా బాబాయ్ అంటూ పిలుచుకునే ఆయన.. ఆదివారం తెల్లవారుజామున ఆయన కుమారుడు రవిబాబు నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచి.. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Follow us on