
కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరోయిన్ సమంత. మయోసైటిస్ సమస్యకు ఇమ్యూనిటీ కోసం చికిత్స తీసుకున్న ఆమె ఇన్నాళ్లు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అలాగే సిటాడెల్ డబ్బింగ్ పనిని కంప్లీట్ చేశారు. అయితే ఇప్పుడు సొంతంగా పాడ్ కాస్ట్ ఛానల్ ప్రారంభించారు. మయోసైటిస్ కారణంగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలను.. తీసుకున్న చికిత్స.. డైట్ ప్లానింగ్ గురించి తన అభిమానులతో పంచుకోనున్నారు. అలాగే ఆరోగ్యం గురించి పలువురు నిపుణులతో కలిసి అవసరమైన విషయాలను ప్రజలకు తెలియజేయనున్నారు. సామ్ హెల్త్ పాడ్ కాస్ట్ సిరీస్ TAKE20 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె అనారోగ్య సమస్యలు, చికిత్స, జాగ్రత్తలు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మరోసారి డివోర్స్ గురించి రియాక్ట్ అయ్యారు. తన జీవిత భాగస్వామితో విడిపోయిన ఏడాది ఎంతో కష్టతరమైనదని.. అత్యంత కష్టమైన ఏడాది అంటే అదేనంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పాడ్ కాస్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
TAKE 20 పాడ్ కాస్ట్ మొదటి ఎపిసోడ్లో ఆరోగ్య నిపుణులు అల్కేష్ తో ముచ్చటించింది సమంత. “నాకు మయోసైటిస్ సమస్య రావడానికి ముందు ఏడాది ప్రత్యేకంగా గుర్తుంది. ఎందుకంటే ఆ సంవత్సం చాలా కష్టతరమైనది. నా స్నేహితుడు, మేనేజర్ హిమాంక్ నేను ముంబై నుంచి తిరిగి ప్రయాణిస్తున్న రోజు ఇంకా గుర్తుంది. ఆ సంవత్సరం జూన్ లో నేను ప్రశాంతంగా ఉండాలని.. కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నాకు చెప్పాడు. కానీ అసలు ప్రశాంతంగా ఉండలేకపోయాను. కానీ మెల్లగా ఊపిరి పీల్చుకోగలిగాను. నిద్రించేందుకు ప్రయత్నించాను. ఆ తర్వాత నేను నా పనిపై దృష్టి పెట్టాను. కష్టమైన పరిస్థితుల నుంచి నేను మేల్కొన్నాను. ” అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే సామ్ మాట్లాడుతూ.. “నేను ఈ పాడ్ కాస్ట్ చేయడానికి కారణం.. నేను అనుభవించిన బాధాకరమైన పరిస్థితులు.. ఆటో ఇమ్యూనిటి పరిస్థితి జీవితాంతం ఎలా ఉంటుంది.. నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను అనే విషయాలను ప్రజలకు.. నా అభిమానులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వారు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపింది. 2022లో తాను మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు సామ్ వెల్లడించింది. మయోసైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా సమయం పడుతుందని.. ఎప్పుడు బలంగా ముందడుగు వేయాల్సిన అవసరం లేదని గ్రహించినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. సామ్ చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.