A.R. Rahman: ‘ఏ.ఆర్.రెహమాన్ మంచివారు..’ అందుకే విడాకులు అన్న సైరాబాను
విడాకుల వ్యవహారంపై ఏఆర్ రహమాన్ మాజీ భార్య సైరాబాను రియాక్ట్ అయ్యారు. డివోర్స్‌కు కారణాలతో పాటు ఏఆర్ రహమాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ.. ఏఆర్ రహమాన్‌పై సైరాబాను ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
ఏ.ఆర్.రెహమాన్‌తో విడాకులపై ఆయన మాజీ భార్య సైరాబాను మౌనం వీడారు. డివోర్స్‌కు కారణాలను ఆడియో ద్వారా వెల్లడించారు. రెహమాన్ మంచి వ్యక్తి అని.. ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని సైరాబాను విజ్ఞప్తి చేశారు. ఏఆర్ రహమాన్‌ను జీవితాంతం నమ్ముతానని.. ఆయన వజ్రం లాంటివారని కొనియాడారు. తమ విడాకులకు అనారోగ్య సమస్యలే కారణమని స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలతోనే చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చాల్సి వచ్చిందని.. ముంబైలో చికిత్స కొనసాగుతుందని చెప్పారు. కొద్దిరోజులపాటు చెన్నైని విడిచిపెట్టడానికి హెల్త్ ప్రాబ్లెమే కారణమన్నారు. బిజీ షెడ్యూల్లో ఉండే రెహమాన్‌కు, ఆయన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదనే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దయచేసి అసత్య ప్రచారాలు చేయవద్దని యూట్యూబర్స్కు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు విజ్ఞప్తి చేశారు సైరాబాను.
ఇక.. రెహమాన్ జంట విడాకుల అనౌన్స్మెంట్ తర్వాత ఆయనతో పనిచేసే ఓ మహిళతో ముడిపెడుతూ రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై రెహమాన్ లీగల్ టీమ్ కూడా సీరియస్ అయింది. తప్పుడు కంటెంట్‌ను వెంటనే డిలీట్ చేయాలని.. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా.. రెహమాన్ మాజీ సతీమణి సైరాబాను కూడా స్పందించి.. అసత్య ప్రచారాలు సర్క్యులేట్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు.