బాలీవుడ్ ప్రముఖ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ కు ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఇంట్లో సైఫ్ అలీఖాన్ ఒక్కడే ఉన్నాడని తెలుస్తోది. కరీనా కపూర్ బుధవారం (జనవరి 15) రాత్రి కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్‌లతో కలిసి ఓ పార్టీకి వెళ్లింది. కరీనా కపూర్ కూడా సోషల్ మీడియాలో పార్టీ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. దానికి ‘గర్ల్స్’ నైట్ ఇన్’ అని క్యాప్షన్ పెట్టింది. కాబట్టి దాడి జరిగినప్పుడు ఆమె ఇంట్లో లేదని తెలుస్తోంది. ఒక వేళ ఇంట్లోనే ఉండి ఉంటే సైఫ్ తో పాటు కరీనాకు కూడా ముప్పు ఏర్పడి ఉండేది. కాగా గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో సైఫ్ ఇంట్లో చోరీ యత్నం జరిగింది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ఇల్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ముంబైలోని బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి తెల్లవారుజామున ఓ దొంగ ప్రవేశించాడు. అతడి రాకను తెలుసుకున్న ఇంటి పని మనుషులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ గొడవతో సైఫ్ అలీఖాన్ లేచి అక్కడికి చేరుకున్నాడు. ఆపై అడ్డుకునేందుకు వెళ్లిన సైఫ్‌పై దొంగ దాడి చేశాడు. దీంతో నటుడి వీపు భాగంతో పాటు ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. వీపు ఎముక దగ్గర లోతైన గాయం కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. మరోవైపు సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీఖాన్‌కు శస్త్రచికిత్స జరిగింది.
సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో ఇంటి పనివాళ్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటుడి ఇంటికి రెండు ద్వారాలు ఉన్నాయి. 4 గార్డులు పనిచేస్తున్నారు. అయితే ఆ దొంగ ఎలా వచ్చాడన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంట్లో ఎవరైనా సహాయం చేశారా అనే ప్రశ్న కూడా ఉంది. ఈ కేసును విచారించేందుకు ముంబై పోలీసులు 7 బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
కాగా సైఫ్ పై జరిగిన దాడిపై కరీనా కపూర్ టీమ్ స్పందించింది. ‘ఇంట్లోకి దొంగతనానికి చొరబడిన వ్యక్తి సైఫ్ ఆలీ ఖాన్‌పై దాడి చేశారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఘటనపై మరిన్నీ వివరాలు త్వరలోనే మీకు అందిస్తాం’ అని టీమ్ వెల్లడించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.