S Saraswathi Movie Review: ‘ఎస్.సరస్వతి’ మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్‌గా మెప్పించారా..?

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో తొలిసారిగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం 'ఎస్. సరస్వతి'. సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా ఈ సినిమా పేరును 'సరస్వతి' నుంచి 'ఎస్. సరస్వతి'గా మార్చారు. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నాజర్ లాంటి నటీనటులు నటించిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

S Saraswathi Movie Review: ‘ఎస్.సరస్వతి’ మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్‌గా మెప్పించారా..?
S Saraswathi

Edited By:

Updated on: Mar 06, 2026 | 12:58 PM

మూవీ రివ్యూ: ఎస్. సరస్వతి

నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, కిషోర్, రావు రమేష్, మురళీ శర్మ, రాధిక శరత్ కుమార్ తదితరులు

సంగీతం: ఎస్. థమన్

సినిమాటోగ్రఫీ: ఏ.ఎం. ఎడ్విన్ సాకే

ఎడిటర్: వెంకట్ రాజన్

దర్శకత్వం: వరలక్ష్మి శరత్ కుమార్

నిర్మాతలు: పూజా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో తొలిసారిగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్. సరస్వతి’. సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా ఈ సినిమా పేరును ‘సరస్వతి’ నుంచి ‘ఎస్. సరస్వతి’గా మార్చారు. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నాజర్ లాంటి నటీనటులు నటించిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ, సింగిల్ పేరెంట్‌గా తన 12 ఏళ్ల కూతురు ‘సరస్వతి’ (నివేష్క నాయుడు)ని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. సరస్వతి 12వ పుట్టినరోజున పాపను స్కూల్‌లో దింపి వెళ్లిన లక్ష్మికి, తిరిగి వెళ్లేసరికి కూతురు కనిపించదు. అసలు ఆ పాప తమ స్కూల్‌లోనే చదవడం లేదని యాజమాన్యం బుకాయిస్తుంది. కానీ స్కూల్ ప్రిన్సిపాల్ రూమ్‌లోనే పలుకుబడి ఉన్న ముగ్గురు వ్యక్తుల చేతిలో సరస్వతి దారుణంగా అత్యాచారానికి గురై చనిపోతుంది. ఆ షాక్‌లో కూతురి పరువు పోకూడదనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా లక్ష్మి తన బిడ్డ మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చిపెడుతుంది. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసులో లక్ష్మికి న్యాయం జరిగిందా? ప్రముఖ క్రిమినల్ లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్) ఈ కేసును ఎందుకు టేకప్ చేశాడు? ‘ఫాంటసీ ప్రోన్ డిజార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడే లక్ష్మి తన కూతురి కోసం ఏ విధంగా కాళికామాతలా మారి పోరాడింది? సెకండాఫ్‌లో వచ్చే ప్రియమణి పాత్రకు ఈ కథతో ఉన్న సంబంధం ఏమిటి? అనేది వెండితెరపై చూడాల్సిన మిగతా కథ.

కథనం:

సింపుల్ కథనే కానీ మెడికోర్ డ్రామాగా దీన్ని రాసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కథ ఆసక్తికరంగానే మొదలవుతుంది.. కానీ సినిమా సాగుతున్న కొద్దీ కథనం ఊహించే విధంగా మారడంతో దాని ఇంపాక్ట్ తగ్గిపోయింది. ఫస్టాఫ్ కాస్త తెలిసిన సెటప్ అయినప్పటికీ ఒక మోస్తరు వేగంతో సాగుతుంది. కానీ మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సిన సెకండాఫ్, సాగదీసినట్లుగా అనిపిస్తుంది. నాజర్, మురళీ శర్మ, రాధిక శరత్ కుమార్, జీవా సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించినప్పటికీ, వారి క్యారెక్టర్ ఆర్క్స్‌ సరిగ్గా డెవలప్ చేయలేదు. ఇది కథపై వారి ప్రభావాన్ని పరిమితం చేసింది. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ, ఆయన స్థాయి నటుడి నుండి ఆశించే పవర్‌ఫుల్ కోర్ట్‌రూమ్ వాదనలు చేసేంత స్కోప్ ఆ పాత్రకు దక్కలేదు. రైటింగ్‌లోని కొన్ని లోపాలు కథనాన్ని బలహీనపరిచాయి. ఉదాహరణకు, ఒక అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న లాయర్.. కోర్టులో తన కేసును తానే వాదించుకోవడం అనేది విచారణ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇలాంటి మరికొన్ని లోపాలు రైటింగ్‌లో కనిపించినా మేకర్స్ వాటిని పట్టించుకోనట్లు అనిపిస్తుంది. మరింత ఎమోషనల్ ఇంపాక్ట్ కలిగించేలా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఇంకాస్త డ్రామాటిక్ డెప్త్‌తో రాసుకోవాల్సింది. పైగా ఇలాంటి సీరియస్ కథనంలో పాటలు పెట్టడం సినిమా ఫ్లోని దెబ్బతీసింది. కానీ దర్శకురాలిగా వరలక్ష్మి మాత్రం మంచి ప్రయత్నమే చేసింది. ‘ఎస్. సరస్వతి’ ఒక గ్రిప్పింగ్ అండ్ ఎమోషనల్ సైకలాజికల్ థ్రిల్లర్. కళ్ల ముందే కూతురికి అన్యాయం జరిగితే, న్యాయం కోసం ఓ తల్లి పడే తపనను దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ తెరపై చక్కగా ఆవిష్కరించింది. కొన్ని లాజికల్ మిస్టేక్స్, సంగీతం నిరాశపరిచినా… ఎమోషనల్ అండ్ కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

నటీనటులు:

వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఆసక్తికరమైన కథాంశంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. కేవలం నటిగానే కాకుండా ఫిల్మ్ మేకర్‌గా కూడా తనలోని మరో కోణాన్ని ఆమె నిరూపించుకున్నారు. కథను సెట్ చేసిన విధానం, క్యూరియాసిటీ పెంచేలా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన తీరు బాగా వర్కౌట్ అయింది. నటిగా ఆమె డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పాత్రకు అవసరమైన ఎమోషనల్ వేరియేషన్స్ చక్కగా పండించారు. విచారణ సన్నివేశాలు, కోర్టు రూమ్ సీన్స్‌లో ఆమె నటన హైలైట్‌గా నిలుస్తుంది. ప్రియమణి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, మురళీ శర్మ లాంటి ప్రతిభావంతులైన నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వారి స్క్రీన్ ప్రెజెన్స్ కథకు బలాన్ని, నమ్మకాన్ని పెంచింది. మిగిలిన వాళ్లంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.

టెక్నికల్ టీం:

తమన్ సంగీతం పర్లేదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. ఏ.ఎం. ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ బాగుంది, సినిమా మూడ్‌కు సరిపోయింది. ఎడిటర్ వెంకట్ రాజన్ క్రిస్పీగా ఉండటానికి కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్‌కు మంచి భవిష్యత్తు ఉంది. కొన్ని లాజిక్స్ పక్కనబెడితే చాలా వరకు బాగానే హ్యాండిల్ చేసింది. సెకండాఫ్‌లో కథనాన్ని మరింత ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేయాల్సింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఎస్. సరస్వతి.. ఎమోషనల్ మెడికోర్ డ్రామా..!

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

Follow Us