
సౌతిండియన్ న్యాచురల్ బ్యూటీ సాయ పల్లవి నటించిన తొలి హిందీ చిత్రం ఏక్ దిన్. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఈ మూవీలో హీరోగా నటించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కేవలం ఓ మోస్తరు కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. సాయి పల్లవి యాక్టింగ్ బాగున్నా ఆమె పక్కన జునైద్ యాక్టింగ్ తేలిపోయిందని విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏక్ దిన్ రిజల్ట్ ఎఫెక్ట్ సాయి పల్లవి నెక్ట్స్ మూవీ రామాయణపై పడిందని తెలుస్తోంది. ‘ఏక్ దిన్’ సినిమాలో సాయి పల్లవి హిందీ యాసపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో రామాయణ చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏక్ దిన్ సినిమా చూసిన వారి అభిప్రాయం ప్రకారం, సాయి పల్లవికి హిందీ భాషపై అంతగా పట్టులేదని అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రమోషన్లలోనూ సాయి పల్లవి మాట్లాడిన మాటలు కూడా ట్రోలింగ్ బారిన పడ్డాయి. ‘ హిందీ పదాలను సరిగ్గా పలకలేని నటిని సీత పాత్రకు ఎందుకు ఎంపిక చేశారు?’ అని చాలామంది సాయి పల్లవిని విమర్శించారు. ఇక ఏక్ దిన్ సినిమాలోనూ సాయి పల్లవి హిందీ యాసపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రామాయణలో సీతామాత పాత్రకు చాలా స్వచ్ఛమైన, స్పష్టమైన హిందీ యాస అవసరమని చిత్ర బృందం భావిస్తోంది. దీంతో సాయి పల్లవి గొంతును ఉపయోగించకుండా, మరో ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను తీసుకోవాలని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా సాయి పల్లవి తన సినిమాలకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. అలాగే ఏక్ దిన్ సినిమాకు కూడా అదే చేసింది. అయితే దీనిపై ట్రోల్స్ ఎదుర్కొంటోందీ అందాల తార. కాగా రామాయాణలో సీత పాత్ర కోసం ముందుగా ఆలియా భట్‌ను ఖరారు చేశారు, కానీ డేట్స్ సమస్యల కారణంగా ఆమె తప్పుకుంది. ఆ తర్వాత సాయి పల్లవిని తీసుకున్నారు.
దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటించాడు. రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ కనిపించనున్నాడు. ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది. రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.