వెండితెర నయా సక్సెస్ ఫార్ములా ఏంటో ఐడెంటి ఫై చేసింది సౌత్ మూవీ ఇండస్ట్రీ. బ్లాక్ బస్టర్ హిట్ రావాలన్న, వెండితెర మీద కనకవర్షం కురవాలన్నా.. పార్ట్ 2 తోనే సాధ్యమన్న కంక్లూజన్ కు వచ్చేశారు. రీసెంట్ గా పుష్ప 2 సక్సెస్ జోరు చూసిన తరువాత ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. భారీ చిత్రాలకు సీక్వెల్ ను తెరకెక్కిస్తే చాలు నిర్మాతలకు కాసుల పంట పండటం ఖాయం అని ఫిక్స్ అవుతున్నారు.
పుష్ప సినిమా నేషనల్ లెవల్ మంచి సక్సెస్ సాధించింది. ఆ బజ్ సీక్వెల్ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. తొలి భాగానికి బాగా కనెక్ట్ అయిన నార్త్ ఆడియన్స్ సీక్వెల్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. అదే సమయంలో భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు. బన్నీ, సుకుమార్ వాళ్ల అంచనాలకు తగ్గ అవుట్ పుట్ ఇవ్వటంతో రిజల్ట్ నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తోంది. థియేటర్లు పుష్పరాజ్ మేనియాతో ఊగిపోతున్నాయి. బాక్సాఫీస్ నెంబర్స్ కొత్త హైట్స్ చూస్తున్నాయి.
ఈ ట్రెండ్ బాహుబలి తోనే మొదలైంది. బాహుబలి తో పాన్ ఇండియా మార్కెట్ కు గేట్లు ఓపెన్ చేసిన రాజమౌళి ఆ సినిమా సీక్వెల్ తో ఇండియన్ స్క్రీన్ కు ఫస్ట్ టైమ్ వెయ్యి కోట్ల గ్రాస్ చూపించారు. ఆ తరువాత కూడా సీక్వెల్స్ విషయంలో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. పార్ట్ 2 గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ కూడా సీక్వెల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొలి భాగంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాకీభాయ్, సీక్వెల్ తో వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే జోరుతో త్రీక్వెల్ ను కూడా లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
బాహుబలి, కేజీఎఫ్ సినిమాల తరువాత సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. పుష్ప2 కూడా మ్యాజిక్‌ను రిపీట్ చేయటంతో అప్ కమింగ్ సీక్వెల్స్ మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. ముఖ్యంగా యానిమల్ 2, కాంతార 2, దేవర 2 సినిమాలు మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్. అదే సమయంలో ఎలాగైన సీక్వెల్స్ ను బిగ్గెస్ట్ హిట్స్ గా నిలబెట్టాల్సిన కంపల్సరి సిచ్యుయేషన్ లో పడిపోయారు ఆ సినిమాల మేకర్స్. మరి నిజంగానే ఈ సినిమాల సీక్వెల్స్ ఆ స్థాయిలో పెర్ఫామ్ చేస్తాయా..? లేదంటే ఇండియన్ 2 లా నిరాశపరుస్తాయా? చూడాలి.