
మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది నటీనటులు కోరుకుంటారు. ఆయన స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ హీరోస్.. నటీనటులు చిరు సినిమాలో ఛాన్స్ వస్తే అసలు వదలుకోరు.. కానీ మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం రెండు సార్లు చిరు అవకాశమిస్తే నో చెప్పారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సలార్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించారు పృథ్వీరాజ్. అయితే ఇప్పుడు ఆయన చిరు సినిమాకు నో చెప్పడమేంటీ ?.. అసలు ఎందుకు చెప్పారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2018లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించే ఛాన్స్ పృథ్వీరాజ్ కు వచ్చిందట. ఇందులో కన్నడ హీరో సుదీప్ పోషించిన పాత్రకు పృథ్వీని సంప్రదించారట మేకర్స్. ఈ పాత్ర కోసం చిరంజీవి స్వయంగా పృథ్వీరాజ్ పేరు చెప్పారట. కానీ అప్పటికే ఆడు జీవితం సినిమా కోసం భారీగా బరువు తగ్గారు పృథ్వీరాజ్. దీంతో సైరా నరసింహరెడ్డి ఛాన్స్ వదులుకున్నారట.
అలాగే 2019లో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్ కోసం చిరంజీవి కేరళ వెళ్లగా, అదే సమయంలో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ స్వయంగా దర్శకత్వం వహించారు. ‘లూసిఫర్’ తెలుగు విడుదల హక్కులను చిరంజీవి స్వయంగా కొనుగోలు చేశారు. . కొన్నాళ్ల తర్వాత ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహించమని చిరంజీవి స్వయంగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ని అడిగారు. కానీ అప్పటికే ఆడు జీవితం సినిమా చేస్తుండడంతో మరోసారి చిరు ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేశారట. ఇలా ఒకే సినిమా కారణంగా రెండుసార్లు చిరంజీవి ఇచ్చిన అవకాశాలను వదులుకున్నానని అన్నాడు పృథ్వీరాజ్.
ఆడు జీవితం సినిమాను దాదాపు పదేళ్లుగా రూపొందిస్తున్నారు. కేరళ నుంచి సౌదీకి వలసవెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఆడు జీవితం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నారు. విదేశాలకు వలస వెళ్లిన వ్యక్తుల జీవితాలు ఎలా మారిపోతాయి ? వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు.. ? పాస్ పోర్టులు లాక్కొని వారిని బానిసలుగా మార్చుకుంటారనేది ? ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. ఈనెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.