Telugu Emotional Song: ఈ పాట విని కంటతడి పెట్టని మనిషి ఉంటాడా..? ఏకంగా 2 నంది అవార్డులు

తెలుగు సినిమా చరిత్రలో ప్రతిఘటన చిత్రంలోని "ఈ దుర్యోధన దుశ్శాసన" పాట ఓ మైలురాయి. వేటూరి అద్భుతమైన సాహిత్యం, ఎస్. జానకి గానం, చక్రవర్తి స్వరకల్పనతో స్త్రీ గౌరవాన్ని చాటిచెప్పిన ఈ గీతం రెండు నంది అవార్డులను గెలుచుకుంది. నేటికీ ఈ పాట తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూనే ఉంది.

Telugu Emotional Song: ఈ పాట విని కంటతడి పెట్టని మనిషి ఉంటాడా..? ఏకంగా 2 నంది అవార్డులు
Telugu Emotional Song

Updated on: Jan 22, 2026 | 5:06 PM

తెలుగు చలనచిత్ర చరిత్రలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ప్రతిఘటన ఒకటి. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం సమాజానికి ఒక బలమైన సందేశాన్ని అందించింది. ఈ చిత్రంలోని “ఈ దుర్యోధన దుశ్శాసన” గీతం తెలుగు సినీ పాటల తోటలో పారిజాత పుష్పం లాంటిది. తనను అవమానించే నెపంతో స్త్రీ జాతినే కించపరిచిన విద్యార్థులకు హీరోయిన్ కనువిప్పు కలుగజేసే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఈ పాట తన సాహిత్య విలువలతో, సందేశంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ గీతం తెలుగు సినిమా సాహిత్య గొప్పదనాన్ని చాటిచెబుతుంది. పాటల తోటమాలి వేటూరి రాసిన ఈ గీతం ఏకంగా రెండు నంది అవార్డులను సంపాదించి, దాని సాహిత్య ప్రాధాన్యతను నిరూపించింది. మనిషిలో వెలుగు నీడలు, మంచి చెడులు రెండూ ఉంటాయని, అవి హద్దు మీరితే ప్రమాదమని ఈ పాట తెలియజేస్తుంది. కనిపించిన ప్రతీ స్త్రీని.. తల్లి, చెల్లి, గురువు అనే విచక్షణ లేకుండా ప్రవర్తించే వారిని పశువులతో పోల్చి, అలాంటి వారి మీద ఎక్కుపెట్టిన అస్త్రమే ఈ గీతమని వేటూరి గారు వివరించారు.

ఈ పాటలో “ఆరవ వేదం, మానభంగ పర్వంలో, మాతృ హృదయ నిర్వేదం” వంటి లోతైన పదబంధాలు ఉన్నాయి. దుర్వినీతమైన ఈ లోకం పంచమ వేదంగా భావించే మహాభారతానికి ప్రతిగా, స్త్రీ పవిత్రతను, ఆమెలోని మాతృత్వాన్ని ఉన్నతంగా తెలియజేస్తూ, మరో భారతాన్ని ఆరవ వేదంగా రచిస్తానని చెబుతుందో మగువ అని వేటూరి తన సాహిత్యంలో గొప్ప భావాన్ని వ్యక్తీకరించారు. “మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం” అంటూ వేటూరి తనకు మాత్రమే సాధ్యమైన పదాలతో కన్నీరు పెట్టించారని చెబుతారు.

Also Read: ‘ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు’.. ఎన్టీఆర్ ఎమోషనల్ 

ఈ పాట పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ సన్నివేశానికి మొదట డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే, ఆ డైలాగ్స్ పేలవంగా అనిపించి, ఒక పాట ఉంటేనే ఈ సీన్ రక్తి కడుతుందని వేటూరి భావించారు. పాట వేగాన్ని నాశనం చేస్తుందని కొందరు వాదించినా, అది వేగాన్ని పెంచుతుందని వేటూరి వాదించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు పాట రాయమని చెప్పడంతో, ఈ అద్భుత గీతం రూపుదిద్దుకుంది. భారతీయ పురాణ ఇతిహాసాల్లోని ఎన్నో అంశాల్ని అలుతి పదాల్లో రంగరించి వేటూరి రాసిన ఈ గీతం సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. తెలుగు సినీ వినీలాకాశంలో ధ్రువతారలుగా వెలుగొందుతున్న ఎంతో మంది ప్రముఖులకు బాగా నచ్చిన గీతం కూడా ఇదే కావటం దీని విశేషతను తెలియజేస్తుంది. వేటూరి అద్భుతమైన రచన మాత్రమే కాదు, సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన విధానం, గాయిని ఎస్. జానకి గొంతులోని ఆర్ధ్రత వెరసి ఈ గీతానికి వన్నె తీసుకొచ్చాయి. అనుకోకుండా రాసిన ఈ పాట సినిమాకే మకుటంగా నిలిచిపోయింది. ఇప్పటికీ ప్రతిఘటన పేరు చెప్పగానే తొలుత “ఈ దుర్యోధన దుశ్శాసన” పాటే గుర్తుకు వస్తుంది. ఈ పాట వింటుంటే తెలియకుండానే కళ్లలో చెమ్మ  పడుతుంది.