Pawan Kalyan First Movie: అందరి హీరోలకు అభిమానులుంటారు.. ఆ హీరోకి మాత్రం భక్తులుంటారు.. ఆయన పేరు తెలుగు సినీ ప్రేక్షకుడికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. ఆయనే పవన్ కళ్యాణ్. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా తనకంటూ సొంతం ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇవాళ తన 50వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవిదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టిన రోజు సందర్భంగా పలు సామజిక కార్యక్రమాలను చేపట్టారు.. ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే అశేష అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా అనగానే వెంటనే ఎవరైనా ఠక్కున ఐ.ఐ. సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ అని చెప్పేస్తారు.
అయితే నిజానికి పవన్ కళ్యణ్ వెండి తెరపై లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కే . విశ్వనాథ్ చిత్రంలో అడుగు పెట్టారు. అదీ అన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన శుభలేఖ సినిమాతో అనుకోకుండా అడుగు పెట్టారట. అప్పట్లో మద్రాసు టీ నగర్ లోని పోరూరు సోమసుందరం స్ట్రీట్ లో చిరంజీవి ఫ్యామిలీ నివాసం ఉండేవారు. దానికి ఎదురుగా నటి విజయనిర్మల ఇల్లు ఉండేది. ఆ సందులోనే వారి డబ్బింగ్ థియేటర్ ఉండేది. ఒక రోజు ఆ డబ్బింగ్ థియేటర్ లో చిరంజీవి కే విశ్వనాథ్ కాంబోలో తొలి సినిమా శుభలేఖ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత.. చిరంజీవి కి టీ ఇవ్వటానికి డబ్బింగ్ థియేటర్ కు వెళ్లారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వయసు పదహారేళ్ల ఉంటాయి. శుభలేఖ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సర్వర్ గా పని చేశారు. హోటల్ సీన్ లో వెనుక రకరకాల చిన్న చిన్న పాత్రలు మాట్లాడుతుంటాయి. డబ్బింగ్ థియేటర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు శుభలేఖ చిత్ర నిర్మాత వి.వి.శాస్త్రి ఈ డబ్బింగ్ చెప్పరా అంటూ ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు. మంచినీళ్లు ఎక్కడ సార్ అనే ఓ చిన్న డైలాగ్ ఇచ్చారు. అప్పుడు పవన్ ఆ డైలాగ్ చెప్పారు.. ఇప్పటికి ఆసీన్లో పవన్ కళ్యాణ్ గొంతు సినిమాలో వినిపిస్తుంది. అదే సినీ రంగంలోకి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎంట్రీ.. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం.. కళాతపస్వి కే విశ్వనాథ్ సినిమాతో జరిగిపోయిందని చెప్ప వచ్చు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్.. కే విశ్వనాథ్ ను సన్మానించిన సమయంలో గుర్తు చేసుకున్నారు కూడా..