
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అయితే విజయ్ సినిమాల గురించి కాకుండా ఎక్కువగా పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా విజయ్ గురించి అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అయన సినిమాలకు సంబంధించి అసభ్యకర వార్తలను ప్రసారం చేశాడు.
పూర్తి వివరాల్లోకెలితే.. అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ దేవరకొండను అవమానిస్తూ అసత్యపు వార్తలను ప్రసారం చేశాడు. విజయ్ గౌరవాన్ని కించపరిచేలా.. ఆయన సినిమాలలోని హీరోయిన్లను అవమానిస్తూ వీడియోస్ చేశాడు. ఆ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం విజయ్ టీం దృష్టికి వెళ్లగా వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే విజయ్ గురించి అసత్యపు వీడియోస్ చేసిన వ్యక్తి అనంతపురానికి చెందిన వెంకట్ కిరణ్ గా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 2590/2023 గా కేసులు నమోదు చేశారు.
అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ని డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్ లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక పై ఎవరైనా ఇలా టార్గెటెడ్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీలకపాత్రలో దివ్యాన్ష కౌశిక్ నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.