నందమూరి, కొణిదెల కుటుంబాల అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన అన్‌స్టాపబుల్2 ఫినాలే ఎపిసోడ్.. గురువారం రాత్రి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్‌లో బాలయ్య అదే జోరు ప్రద్శరించగా.. పవన్ కాస్త రిజర్వ్‌డ్‌గా కనిపించారు. చాలా సరదా ప్రశ్నలతో పాటు కొన్ని సీరియల్ క్వచ్చన్స్ కూడా వేశారు బాలయ్య. వాటన్నింటికీ పవన్ ఓపికగా సమాధానమిచ్చారు. తన సినీ ప్రస్థానం ఎలా ప్రారంభయ్యింది.. అనుకోకుండా ఎలా నటుడయ్యారు..? రామ్ చరణ్‌తో బాండింగ్ ఎలా ఉంటుంది..? మేనళ్లుల్లు ఎలాంటివారు..? మూడు పెళ్లిళ్ల గొడవేంటి వంటి ప్రశ్నలు వేశారు బాలయ్య. వాటన్నింటికి తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు పవన్. ఇంక ఫన్నీ మూమెంట్స్‌కు అయితే కొదవలేదు.
అయితే అటు నందమూరి, కొణిదెల కుటుంబాలకు ఏదో వార్ ఉన్నట్లుగా తొలి నుంచి బయట ప్రొజెక్ట్ చేశారు కొందరు. కులాల జాడ్యాన్ని కూడా ఇందులోకి తీసుకువచ్చారు. సోషల్ మీడియా వేదికగా నిత్యం.. కామెంట్ల వార్ జరుగుతూనే ఉంటుంది. డైరెక్ట్‌గా కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ అమలాపురమో.. భీమవరంలోనే కాదు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల సమయంలో అమెరికాలోని డల్లాస్‌లో ఇరు వర్గాల ఫ్యాన్స్ గొడవపడి.. తెలుగువారి పరువు తీశారు. కానీ చిరు, బాలయ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు.. ఎప్పుడో చెన్నైలో ఉన్నప్పటి నుంచే. అక్కడ కలిసి పార్టీలు చేసుకునేవారు. కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్స్‌కు సైతం వెళ్లేవారు. పవన్ తొలి మూవీ ఓపెనింగ్‌కు సైతం బాలయ్య వెళ్లారు. అంతేనా.. చిరు కుమార్తె వివాహ ఫంక్షన్‌లో అదిరిపోయే స్టెప్పులు కూడా వేశారు బాలయ్య. ఇలా వారి మధ్య అనుబంధాన్ని చెప్పే ఘటనలు ఎన్నో.. ఎన్నెన్నో.
తాజాగా జరిగిన అన్‌స్టాపబుల్2 ఫినాలే ఎపిసోడ్‌లో సైతం బాలయ్య, పవన్ ఒకరిపై, మరొకరికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తామిద్దరం ఎన్నో ఫంక్షన్స్, పార్టీలలో కలిసినట్లు చెప్పుకొచ్చారు. చిరంజీవి కుటుంబంలో అందరూ ఎంతో క్షమశిక్షణతో ఉంటారని.. ఎక్కడ కలిసినా ఎంతో గౌరవంగా మాట్లాడతారని బాలయ్య ప్రశంసించారు. బాలయ్య ముక్కుసూటి మనిషి అని.. ఫిల్టర్ ఏమి ఉండదని.. అలాంటి వారు చాలా అరుదు అని పవన్ ప్రశంసలు కురిపించారు. అభిమానం ఉండటంతో తప్పులేదు.. కానీ ఎదుటివారిని ద్వేషించే విధంగా కాదు. కొట్లాటలకు దిగే విధంగా కాదు. అందుకే తెలుగు ఇండస్ట్రీ టిపికల్ పర్సనాలిటీస్… అన్నగారి తనయుడు, చిరంజీవి గారి తమ్ముడు పాలుపంచుకున్న ఈ ఎసిసోడ్‌ను ఒకటికి, రెండుసార్లు చూడండి. మైండ్ సెట్లు కాస్త మార్చుకోండి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.