Tollywood: 100 సార్లు ఉత్తమ నటుడి అవార్డు.. ఆ పనితో చివరికి రూ.50, రూ.100 కూడా లేక..

అమెరికా రాజకీయాల నుంచి ఆధ్యాత్మిక విషయాల వరకు అవగాహన ఉన్న వ్యక్తి పి.ఎల్. నారాయణను చెప్పేవారు అప్పటితరం సినీ ప్రముఖులు. పాత్రలో జీవించే అద్భుత నటుడు, రచయిత, దర్శకుడు. తెలుగు నటుడికి తొలి జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డు తెచ్చిన ఘనత ఆయనదే. నాటకరంగంలో ఫేమస్ అయ్యి, వయసు మళ్లిన తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి మెప్పించారు.

Tollywood: 100 సార్లు ఉత్తమ నటుడి అవార్డు.. ఆ పనితో చివరికి రూ.50, రూ.100 కూడా లేక..
PL Narayana

Updated on: Dec 21, 2025 | 6:43 PM

ఆయనతో మాట్లాడడమే ఒక విద్య అనే సామెతకు నిదర్శనంగా నిలిచారు దివంగత నటుడు పి.ఎల్. నారాయణ. అమెరికా దేశ రాజకీయాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక విషయాల వరకు ప్రతి అంశాన్ని సవివరంగా వివరించగల అపార జ్ఞానం ఆయన సొంతం. ఆయన వివరిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న జనం మైమరచి వినేవారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందులో జీవించే పి.ఎల్. నారాయణ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు. ఆయన రచయితగా, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. తన వయసుకు మించిన పాత్రలను అద్భుతంగా పోషించి, ప్రేక్షకుల మెప్పు పొందారు. సన్నగా, బక్క పలుచగా ఉండే పర్సనాలిటీ లోపాన్ని నటనతో కనుమరుగు చేయగల అద్భుత నటుడాయన. తెలుగు నటుడికి జాతీయ స్థాయిలో తొలి ఉత్తమ సహాయ నటుడి అవార్డును తెచ్చిపెట్టిన ఘనత పి.ఎల్. నారాయణకే దక్కుతుంది. ఈ తరం ప్రేక్షకులకు ఆయన అంతగా తెలియకపోవచ్చు కానీ, పాత తరం సినిమాలు, నటీనటులను అభిమానించేవారికి ఆయన సుపరిచితుడు.

పి.ఎల్. నారాయణ అసలు పేరు పుదుక్కొట్టై లక్ష్మీ నారాయణ. నారాయణ తెలుగువాడు కాదు, మలయాళీ. అయితే, ఆయన పూర్వీకులు ఎప్పుడో ఆంధ్రాలో సెటిల్ అవ్వడంతో..  ఆయన తెలుగువాడిగానే పెరిగారు. అనంతమ్మ, సుబ్రహ్మణ్యం దంపతులకు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు పి.ఎల్. బాల్యం నుంచే నారాయణకు నాటకాలపై అపారమైన ఆసక్తి ఉండేది. నాటకాల్లో నటించి మంచి పేరు సంపాదించుకోవాలనే కోరికతోనే పెరిగారు. చీరాల కళాశాలలో బి.ఏ చదువుతున్నప్పుడు ప్రఖ్యాత సినీ నిర్మాత రామానాయుడు ఆయనకు క్లాస్‌మేట్‌. డిగ్రీ పూర్తయిన తర్వాత రామానాయుడు నిర్మాతగా స్థిరపడగా, పి.ఎల్. నారాయణ నటుడిగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పి.ఎల్. నారాయణ 1953లో నాటకరంగంలోకి అడుగుపెట్టారు. ఆరేళ్ల తర్వాత, 1959లో తొలిసారిగా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దాదాపు 100 సార్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్నారు. ఆ రోజుల్లోనే ఆయన బాపట్లలో కళావాణి పేరుతో సొంత నాటక సంస్థను స్థాపించి, అనేక నాటకాలను విజయవంతంగా ప్రదర్శించారు. ఆర్య చాణక్య, ఇండియా దట్ ఈజ్ భారత్, తమసోమా జ్యోతిర్గమయ వంటి పలు నాటకాలను రచించారు. ఆయన యవ్వనమంతా నాటకరంగంలోనే గడిచిపోయింది. ఎన్నో పాత్రలను స్టేజీ మీదే పోషించి, గొప్ప పేరు సంపాదించుకున్నారు.

వయసులో ఉన్నప్పుడు నాటకరంగంలో ఇంతటి అనుభవం, అవార్డులు పొందినా, సినిమా రంగం నుంచి ఆయనకు పిలుపు రాలేదు. నిజానికి, యవ్వనంలో సినిమా నటుడు కావాలని, తెరపై ఒక్కసారైనా కనిపించాలని పి.ఎల్. నారాయణ ఆశపడ్డారు. కానీ దాని కోసం కలలు కని విలువైన కాలాన్ని వృథా చేసుకోలేదు. ఆయన జీవితం చరమాంకానికి చేరుకుంటున్న సమయంలో, సినిమా అవకాశాలు ఆయన్నే వెతుక్కుంటూ వచ్చాయి. 1974లో విడుదలైన నీడలేని ఆడది చిత్రంతో పి.ఎల్. నారాయణ సినీ రంగ ప్రవేశం చేశారు. అంతా కొత్తవారితో తీస్తున్న సినిమా కావడంతో, రంగస్థల నటుడిగా ఆయనకున్న పేరును బట్టి దర్శకుడు, నిర్మాతలు ఆయనకు అవకాశం కల్పించారు. నీడలేని ఆడది మంచి విజయం సాధించినా, పి.ఎల్. నారాయణకు ఆశించినంత గుర్తింపు రాలేదు. దీంతో ఆయన మద్రాసులో కొనసాగకుండా బాపట్లకు తిరిగి వచ్చారు. అక్కడ నాటకాలు ఆడుతూనే, రామకృష్ణ లంచ్ హోమ్ పేరుతో ఒక హోటల్‌ను నిర్వహించేవారు. ఈ దశలో, అంటే 1977లో, చిలకమ్మ చెప్పింది చిత్రంలోని మన్మథరావు పాత్ర కోసం మద్రాస్ నుండి పి.ఎల్. నారాయణకు పిలుపు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ అప్పటికే సగం పూర్తైంది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు.

ఎంతో ప్రతిభ ఉన్న ఆయనకు మద్యపానం పెను సమస్యగా మారింది. ఆయన డైలీ డ్రింక్ చేసేవారని అప్పటి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఆయనకు నిర్మాతలు పారితోషకం కింద నగదు బదులు మందు బాటిల్స్ ఇచ్చేవారట. ఒక దశలో ఆయన అవకాశాలు లేక.. డబ్బు లేక.. కనిపించినవారికి ఎంతో కొంత ఇవ్వమని అడిగేవారని తెలిసింది. చివరికి తీవ్ర దుర్భర పరిస్థితుల్లో 1998లో ఆయన కన్నుమూశారు.

పీఎల్ నారాయణ మేనకోడలు ఊహ తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత ప్రముఖ హీరో శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.