Nandamuri Taraka Ratna: టీడీపీ పార్టీలో నందమూరి తారకరత్న పాత్ర ఇదే

ఇటీవల..టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో నందమూరి తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కుప్పం వెళ్లి మరీ అన్నీ తానై చూసుకున్నారు.

Nandamuri Taraka Ratna: టీడీపీ పార్టీలో నందమూరి తారకరత్న పాత్ర ఇదే
Taraka Ratna

Edited By:

Updated on: Feb 18, 2023 | 10:26 PM

నందమూరి తారకరత్న మరణం తో తెలుగు రాష్ట్ర ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కెరీర్‌ ఒడిదుడుకుల్లోనే సాగింది. దాంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ షురూ చేశారు. అదే పొలిటికల్‌ ఎంట్రీ. అందుకోసం కసరత్తు మొదలుపెట్టేశారు. వచ్చే జనరల్‌ ఎలక్షన్‌లో ఏపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇటీవల..టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో నందమూరి తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కుప్పం వెళ్లి మరీ అన్నీ తానై చూసుకున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీ నేతలను కూడా తారకరత్న కలుపుకుని పోతున్నారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడును కలిశారు. సీసీ నివాసానికి వెళ్లిన తారకరత్న నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా తారకరత్నను ఘనంగా సత్కరించారు. పరిటాల రవి 18వ వర్ధంతి రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో జరగ్గా.. పరిటాల ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు.

రీసెంట్‌గా గుంటూరు వెళ్లిన తారకరత్న టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్‌ తప్పకుండా వస్తారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తమ్ముడు ఖచ్చితంగా వస్తారన్నారు. ఏపీలో టీడీపీకి అందరం అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. రానున్న జనరల్‌ ఎలక్షన్‌లో ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీని గెలిపించి.. చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు తారక్‌. తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారక రత్న చెప్పడంతో.. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ సీటు కేటాయిస్తారని ప్రచారం జరిగింది.

తారకరత్న టీడీపీ తరపున గతంలో ప్రచారం కూడా చేశారు. ఆయన పోటీ చేయాలని డిసైడ్ అవ్వాలే గానీ అసెంబ్లీ సీటు కేటాయించేందుకు టీడీపీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉంది. అయితే.. తారకరత్నకు ఎమ్మెల్యే టికెట్ ఏ స్థానం నుంచి కేటాయిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తారకరత్న కోలుకుని క్షేమంగా తిరిగిరావాలని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ శ్రేణులు, అభిమానులు కోరుకున్నారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు.