Balayya-Vijay Sai Reddy: అసలైన వ్యక్తిత్వాలు కష్టకాలంలోనే తెలుస్తాయ్.. నిజంగా మీ ఇద్దరూ గొప్పోళ్లు

ఆ ఇంట ఒక దీపం కొండెక్కింది. 23 రోజుల పోరాటం తర్వాత అలసిపోయి ఆరిపోయింది. బాబాయ్‌.. పెదనాన్న ఎంతగా నూనె పోసినా..ఒత్తిని ఎంత ఎగదోసినా..దీపం వెలగలేదు. హఠాత్తుగా ఆగిపోయి అందరినీ శోకసంద్రంలో ముంచింది. అందరికంటే ఎక్కువగా తననే నమ్ముకున్న.. తనలో సగమైన అలేఖ్యను ఒంటరిని చేసి వెళ్లింది..మౌనంగా ఒదిగి స్వర్గప్రాప్తికి చేరువైంది.

Balayya-Vijay Sai Reddy: అసలైన వ్యక్తిత్వాలు కష్టకాలంలోనే తెలుస్తాయ్.. నిజంగా మీ ఇద్దరూ గొప్పోళ్లు
Nandamuri Balakrishna - MP Vijay Sai Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 20, 2023 | 9:30 AM

నాన్న ఒక్కసారి తిరిగిరావా.. అమ్మ ఆపకుండా ఏడుస్తోంది. నాన్న ఒక్కసారి కళ్లు తెరవవా ఏడ్చిఏడ్చి అమ్మ కళ్లలో తడి ఆరిపోయింది. తారకరత్న పిల్లలు ఇలా మాట్లాడుతూ ఏడుస్తుంటే..ఏమని చెప్పగలం..ఎంతని చెప్పగలం.. అంత విషాదం ఆమె జీవితాన్ని కుదిపేసింది. ఆమెనే అలేఖ్య రెడ్డి.. తారకరత్న భార్య.. ప్రేమించి పెళ్లి చేసుకుంది..ఇప్పుడు సముద్రమంత బాధతో తల్లడిల్లిపోతోంది. ఒక్కసారిగా జీవితంలో కుంగిపోయినట్లయ్యింది..కడదాకా తోడుగా ఉంటానన్నవాడు..కాలం కలిసిరాక..దేవుడు దయ చూపక మధ్యలోనే దూరమయ్యాడు. ముగ్గురు పిల్లలతో ఆమె పడుతున్న వేదన మాటలకందనిది..

జగమంత కుటుంబంలో ఏకాకి జీవిగా మిగిలిన ఆమెకు అండగా పెదనాన్న విజయసాయి రెడ్డి.. తారకరత్న బాబాయ్‌ బాలకృష్ణ అండగా నిలిచారు. ఆ ఇద్దరికీ ఇద్దరు అండగా నిలబడ్డారు. అబ్బాయికి కడదాకా బాబాయి, అలేఖ్యకు కష్టంలో తోడుగా పెదనాన్న.. చివరి వరకు నిలబడ్డారు. జనవరి 27 న లోకేష్‌ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నను హుటాహుటిన కుప్పంలోని ఆస్పత్రికి చేర్చారు బాబాయ్‌ బాలయ్య. ఆ తర్వాత అక్కడ్నించి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

ఆ క్షణం నుంచి..నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి తుది శ్వాస విడిచేదాకా తారకరత్న చేయి వదల్లేదు బాబాయ్‌ బాలయ్య. మృత్యువుతో పోరాడి అయినా సరే అబ్బాయిని దక్కించుకోవాలని బాబాయి తపించిపోయారు. తారకరత్న మృత్యువుతో పోరాడుతుంటే ఆయన చెవిలో బాలయ్య మృత్యుంజయ మంత్రం చదివి అబ్బాయిని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నం అందరికంటా తడి పెట్టించింది. అలాగైనా ఆ దేవుడు పంచప్రాణాలను హరించకుండా.. తారకను కాపాడుతాడని అనుకున్నారు. కానీ..దేవుడు దయ చూపలేదు..కాలం కలిసి రాలేదు..అబ్బాయి ఆరోగ్యం కోసం బాబాయ్‌ బాలకృష్ణ పడిన తపన అందరిని కదిలించింది. తారకరత్న కోసం బాలకృష్ణ పలుసార్లు కంట తడి పెట్టుకున్నారు. తారక కోలుకోవాలంటూ..పూజలు, హోమాలు కూడా చేయించారు.

మెరుగైన చికిత్స కోసం తారకరత్నను సింగపూర్‌కు తీసుకెళ్లాలని బాలయ్య చాలా ప్రయత్నాలు చేశారు. వీలుకాక..విదేశాల నుంచి పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించారు. కొడుకు లాంటి తారక బతకాలని..లేచి రావాలని..మళ్లీ తమ మధ్య తిరగాలని..తమ కుటుంబంలో ఒక్కడిగా వెలగాలని..తండ్రికంటే ఎక్కువగా బాబాయ్‌ బాలయ్య తపన పడ్డారు..తల్లడిల్లారు. తారకరత్న ఆస్పత్రిలో ఉన్న 23 రోజుల పాటు నిద్రాహారాలు మాని ఎప్పటికప్పుడు బాగోగులు తెలుసుకుంటూ అందరికీ చెప్పేవారు. ఒక దశలో అయితే.. తారక పరిస్థితి చూసి కన్నీరు ఆపుకోలేకపోయేవారు. అన్న కొడుకైనా..తన కొడుకులా చూసుకున్న బాలయ్య..తారక బతకాలని చేయని ప్రయత్నం లేదు. ఒకవైపు షూటింగులున్నా..వాటికి క్యాన్సిల్‌ చేసుకుని..ఎప్పుడంటే అప్పుడు..బెంగళూరు ఫ్లైట్‌ ఎక్కి ఆస్పత్రికి వెళ్లేవారు. డాక్టర్లతో మాట్లాడేవారు. అయినా పరిస్థితి చేయి దాటి పోయింది.. చివరకు తారకరత్నను కోల్పోవాల్సి వచ్చింది.

పెళ్లితో దూరమైన తారకరత్నను..మళ్లీ నందమూరి కుటుంబానికి దగ్గర చేసింది బాలయ్య బాబాయే..అందుకే..బాబాయ్‌ అంటే తారకరత్నకు తండ్రికంటే ఎక్కువ..అది ఎంతగా అంటే..బాబాయ్‌ బాలకృష్ణ ఫోటో తన భుజం మీద పచ్చబొట్టు పొడిపించుకునేంత. తారకరత్నది ప్రేమ వివాహం..పెద్దలు ఒప్పుకోకపోవడంతో సంఘీ టెంపుల్లో స్నేహితుల సమక్షంలో..2012లో అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. అలేఖ్యరెడ్డి ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భార్య సునంద చెల్లెలి కూతురే..సినిమాల్లో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఉన్న అలేఖ్యరెడ్డికి తారకరత్న పరిచయం అయ్యాడు. ఒకరినొకరు ఇష్టపడ్డారు..కొంతకాలం ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. కొంతకాలం..నందమూరి కుటుంబానికి తారకరత్న దూరంగానే ఉన్నారు.. ఆ తర్వాత బాబాయ్‌ బాలయ్య ద్వారా తల్లిదండ్రులకు దగ్గరయ్యారు..తారకరత్నను మళ్లీ కుటుంబంలో కలిసిపోయేలా చేసింది బాలయ్యే..అందుకే బాలయ్య అంటే..అటు తారకరత్నకు, ఇటు అలేఖ్యరెడ్డికి చాలా ఇష్టం..ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు బాలకృష్ణే కాదు.. ఇంకొకరు ఉన్నారు. ఆయనే విజయసాయి రెడ్డి.. అలేఖ్య పెదనాన్న..

పుట్టెడు దుఃఖంలో ఉన్న అలేఖ్యకు పుట్టింటి తరపున అండగా నిలబ్డడారు పెదనాన్న విజయసాయిరెడ్డి. తమ కంటి దీపాన్ని కాపాడుకోవడానికి అటు బాబాయ్‌, ఇటు పెదనాన్న చివరిదాకా ఎంతో ప్రయత్నించారు. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న తారకరత్నకు అన్ని రకాలుగా వైద్య సహాయం అందించేందుకు..బాలయ్య, విజయసాయి..నిత్యం డాక్టర్లతో టచ్‌లో ఉండేవారు..ఆస్పత్రిలో అన్నీ తామై నిలిచారు. అల్లుడు తారకరత్నను క్షేమంగా ఇంటికి తీసుకు రావాలని ఎంతో తపించారు విజయసాయి. తారకరత్న ఆస్పత్రిలో ఉన్న సమయంలో..అలేఖ్యకు ఎంతో అండగా నిలబడ్డారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా.. అటు ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ..ఇటు అలేఖ్యకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అలేఖ్య, తారకరత్నల ప్రేమ వివాహం జరగడంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉందని చెబుతారు. అయితే తారకరత్న కోసం బాలయ్య పడిన శ్రమను మాత్రం ఆయన పదేపదే గుర్తు చేసుకున్నారు.

తారకరత్న తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన భార్యాపిల్లలకు అండగా నిలబడ్డారు విజయసాయి. ఈ బాధ భరించలేనిది కానీ కొంతకాలం తప్పదని చెప్పుకొచ్చారు. తారకరత్న భౌతిక కాయం దగ్గర విజయసాయి పెద్దమనిషిగా అన్నీ తానై నిలిచారు. నివాళులు అర్పించడానికి వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌, చంద్రబాబు, చిరంజీవి, షర్మిల, బాలకృష్ణ..ఇలా ప్రతి ఒక్కరినీ ఆయనే స్వయంగా రిసీవ్‌ చేసుకున్నారు. పార్టీ విభేదాలను పక్కనపెట్టి అందరు అలేఖ్యకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరినీ ఎంతో చనువుగా స్వాగతించి మాట్లాడారు. అలేఖ్య పక్కనే కూర్చుని పేరుకే పెదనాన్న కాదని..పెద్ద మనిషి పాత్ర పోషించారు..హూందాగా అందరినీ కలుపుకుపోయారు.

అటు బాబాయ్‌ బాలకృష్ణ..ఇటు అలేఖ్య పెదనాన్న విజయసాయి రెడ్డి..తారకరత్నను బతికించుకునేందుకు శక్తికి మించి ప్రయత్నించారు. వీళ్ల కష్టం ఫలించలేదు. కోరిక తీరలేదు. విఫల ప్రయత్నంగా మిగిలింది. చివరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది..విధి మరోలా తలచింది. తారకను తీసుకెళ్లింది. అయినా అలేఖ్యకు మేమున్నామంటూ..బాలయ్య, విజయసాయి అండగా నిలిచారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..