
ఆరెంజ్ సినిమా నిర్మాణంలో ఎదురైన ఆర్థిక నష్టాలపై నటుడు, నిర్మాత, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం కారణంగా తాను భారీగా నష్టపోయానని, జీవితకాల సంపాదన కోల్పోయానని తెలిపారు. తాను నమ్మిన వ్యక్తులే మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ నష్టాలకు తన తప్పు కూడా ఉందని నాగబాబు అంగీకరించారు. సినిమాకు వచ్చిన నష్టాల కంటే, నమ్మకద్రోహం వల్ల జరిగిన నష్టం భయంకరంగా ఉందని ఆయన వివరించారు. ఈ పరిణామాలతో రాత్రికి రాత్రే తాను ఆర్థికంగా పూర్తిగా పడిపోయానని పేర్కొన్నారు. అప్పటివరకు పోగు చేసుకున్న సంపద మొత్తం పోవడమే కాకుండా, ఆస్తులు అమ్ముకున్నా కూడా కట్టలేని అప్పుల్లో కూరుకుపోయానని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని.. తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైనట్లు వెల్లడించారు. ఈ కష్టకాలంలో తన అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కల్యాణ్ అండగా నిలిచి ఆదుకున్నారని.. అప్పులు సెటిల్ చేశారని నాగబాబు గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాకు రామ్ చరణ్‌కు సగం మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చానని.. మిగిలిన సగం ఇవ్వలేదన్న రిగ్రెట్ తనకెప్పుడూ ఉంటుందని నాగబాబు చెప్పారు. ఎప్పటికైనా ఆ అమౌంట్ సెటిల్ చేస్తానని నాగబాబు వ్యాఖ్యానించారు. తాను నాన్-వెజ్, లిక్కర్ తీసుకోవడం మానేశానని.. అంత డిప్రెషన్‌లోనూ తాను తిరిగి వాటి జోలికి వెళ్లకుండా నిబద్ధతతో ఉన్నట్లు వెల్లడించారు. ఒక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంటూ, ఆరెంజ్ సినిమా తన జీవితంలో ఒక చేదు అనుభవంగా మిగిలిందని పేర్కొన్నారు.
Also Read: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?