ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి కోటేశ్వర రావు అలియాస్ కోటికి అరుదైన గౌరవం దక్కింది. తెలుగులో వేలాది సినిమాలకు స్వరాలు సమకూర్చిన ఆయన
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. తెలుగు సినిమా సంగీతానికి కోటి అందించిన సేవలకు గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ (ఏఐఎస్‌ఈసీఎస్) ఈ పురస్కారం ప్రదానం చేయనుంది. ఈనెల 26న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మహిళా సాధికారతపై కోటి స్వరపరిచిన ఓ గీతాన్ని గాయని సుస్మిత రాజేష్ ఇదే వేదికపై ఆలపించనున్నారు. ఏఐఎస్‌ఈసీఎస్ ప్రతినిధి రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. ‘4వేల పాటల మైలురాయిని దాటిన కోటి గారిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్‌కు గెస్ట్ ఆఫ్ హానర్‌గా పిలవడం హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంపొందించడానికి దోహదపడతాయి’ అని చెప్పుకొచ్చారు. కోటికి అరుదైన పురస్కారం రావడంపై పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దిగ్గజ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు కోటి. ఆ తర్వాత తన ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో స్నేహితుడు రాజ్‌తో కలిసి రాజ్-కోటి ద్వయంగా ఎన్నో సినిమాలకు స్వరాలు సమకూర్చారు. అయితే 1995 నుంచి సింగిల్‌గానే బాణీలు అందిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోల సినిమాలకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చారాయన. ఆ తర్వాతి తరం హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. ప్రస్తుతం మ్యూజిక్ షోస్‌లో జడ్జిగా యువ సింగర్లకు తనదైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..