
ప్రముఖ నటుడు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు మురళీమోహన్. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మురళి మోహన్ ఆతర్వాత సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. హీరోలకు అన్నయ్యగా.. ఆతర్వాత తండ్రి పాత్రల్లో నటించి మెప్పించారు మురళీ మోహన్. ఇటీవలే ఆయన బాలకృష్ణ నటించిన అఖండ 2లో కనిపించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ హీరో వల్ల తనకు సాయి బాబ అంటే నమ్మకం పోయింది అని అన్నారు ఈ సీనియర్ నటుడు.
నటుడు మురళీ మోహన్ సత్యసాయి బాబా పట్ల తన వ్యక్తిగత అనుభవాలను, ఆయనపై తన అభిప్రాయం ఎలా మారిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సత్యసాయి బాబా ప్రవచించిన “సబ్ కా మాలిక్ ఏక్ హై” సిద్ధాంతాన్ని మురళీ మోహన్ ప్రస్తావిస్తూ.., మానవత్వానికి ఒకే దైవశక్తి ఉందని, దానిని ఏ పేరుతోనైనా కొలవవచ్చని అన్నారు మురళీ మోహన్. అయితే, తన చిన్న వయస్సులో సత్యసాయి బాబా పట్ల తనకు పెద్దగా అభిమానం ఉండేది కాదని మురళీ మోహన్ తెలిపారు. బాబా ధరించే పట్టు వస్త్రాలు, బంగారు ఊయలలో ఊగడం వంటివి తనకు నచ్చేవి కావని తెలిపారు.
అదేసమయంలో ఎన్.టి.రామారావు నటించిన ఒక సినిమాలో ఒక నటుడు జుట్టు గుబురుగా పెంచి దొంగ బాబా పాత్రలో నటించడం కూడా బాబా పట్ల తనకున్న వ్యతిరేక భావనను పెంచిందని అన్నారు మురళీమోహన్. కానీ, అనంతపురంలోని సత్యసాయి కాలేజీ విద్యార్థులు ఒక వార్షికోత్సవానికి ఆహ్వానించిన తర్వాత మురళీ మోహన్ తన ఆలోచన పూర్తిగా మారిపోయింది అని అన్నారు. ఆ కాలేజీ విద్యార్థులు గొడవలు, స్ట్రైక్‌లు లేకుండా, ఉపాధ్యాయులను గౌరవిస్తూ, క్రమశిక్షణతో ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని, బాబా అప్పుడప్పుడు వచ్చి తరగతులకు భంగం కలగకుండా బయటి నుండి చూసి వెళుతుంటారని, మెస్సుకు వెళ్లి వంటవాళ్లను కూడా పలకరిస్తుంటారని విద్యార్థులు చెప్పడం తనను కదిలించిందని అన్నారు. తర్వాత, సత్యసాయి బాబా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నప్పుడు ఆయనకు బాబా పట్ల దైవత్వం కనిపించింది. పుట్టపర్తిలో నిర్మించిన అద్భుతమైన ఆసుపత్రిలో ధనిక, పేద తేడా లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే, కరువు జిల్లా అయిన అనంతపురం సహా రాయలసీమ, సర్కారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక జిల్లాలను దత్తత తీసుకుని ఉచిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించడాన్ని మురళీ మోహన్ ప్రశంసించారు. విద్య, భోజనం, వసతి, వైద్యం, నీరు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చే వ్యక్తి నిజంగా దైవం మానవ రూపంలో ఉన్నట్లే అని ఆయన అప్పుడు భావించా అని మురళీ మోహన్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.