
కలెక్షన్స్ కింగ్, డైలాగ్ కింగ్ అనే బిరుదులు సొంతం చేసుకున్నారు నటుడు మోహన్ బాబు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మోహన్ బాబు. అప్పట్లో టాప్ హీరోగా రాణించి మెప్పించారు. ఇప్పటికీ ఆయన వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మోహన్ బాబు. ఇటీవలే కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే తాజాగా ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలోనే ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది కావాలనే తనకు అవార్డులు రాకుండా చేశారని అన్నారు. తనకు మాత్రమే కాదు తన బిడ్డలకు కూడా అవార్డులు రాకుండా చేశారు.. ఎవరు చేశారో కూడా నాకు తెలుసు అని మోహన్ బాబు అన్నారు.
దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన స్థానాన్ని భర్తీ చేయడం గురించి ప్రస్తావిస్తూ.. మోహన్ బాబు ఆ బాధ్యతను స్వీకరించడానికి నిరాకరించారు. తనకు అనేక ఇతర బాధ్యతలు ఉన్నాయని, ఆ స్థానాన్ని తాను భర్తీ చేయలేనని అన్నారు. చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా ఉంటాను అంటే తాను ఒప్పుకుంటానని, పరిశ్రమ ఎవరి సొత్తు కాదని, అందరూ నాయకులేనని స్పష్టం చేశారు మోహన్ బాబు. నంది అవార్డుల విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని మోహన్ బాబు ప్రస్తావించారు. రాయలసీమ రామన్న చౌదరి, అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, అల్లరి మొగుడు వంటి తన చరిత్ర సృష్టించిన చిత్రాలకు అవార్డులు రాలేదు. కొందరు రాకుండా చేశారు అని అన్నారు మోహన్ బాబు.
నాకు అవార్డు రాకుండా చేసిన వారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ అని చెప్పా.. దేనికి అని అడిగితే.. నాకు అవార్డు ఇవ్వకుండా ఫలానా చెత్త సినిమాకు అవార్డు ఇచ్చారు అని చెప్పా.. ఇంకా ఎంగిలి కూడు తిని ఎందుకు బ్రతుకుతున్నారు అని సీరియస్ అయ్యాను అని మోహన్ బాబు అన్నారు. అవార్డుల కోసం సిఫార్సులు, రాజకీయాలు జరుగుతున్నాయని, తాను ఎప్పుడూ అవార్డుల వెనుక పడలేదని, ప్రజల ఆశీస్సులు, సినిమా విజయం మాత్రమే తనకు ముఖ్యమని తెలిపారు. తన కొడుకు మనోజ్ నటించిన ఝుమంది నాదం క్లైమాక్స్ పాట నభూతో నభవిష్యతి అని పేర్కొంటూ, దానికి కూడా అవార్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు గారికి పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అవార్డులు ఇవ్వలేదని, ఆయన భారతరత్న అవార్డుకు అర్హులని మోహన్ బాబు అన్నారు. అలాగే దాసరి నారాయణరావుకు కూడా అవార్డులు రాలేదు అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.