Tollywood: ‘ఆ దర్శకుడు ఇంటికొచ్చి నడుము చూపించమని అడిగాడు’.. ఓపెన్‌గా చెప్పిన తెలుగు నటి

నటి మిర్చి మాధవి సినీ పరిశ్రమలోని సవాళ్లను నిర్మొహమాటంగా పంచుకున్నారు. అలానే రెమ్యూనరేషన్, సీరియల్స్‌కు సొంత ఖర్చులతో చీరలు సమకూర్చుకోవడం గురించి వివరించారు. కాస్టింగ్ కౌచ్‌పై తన అభిప్రాయాన్ని, దాదాపు 12 ఏళ్ల క్రితం ఒక దర్శకుడితో ఎదురైన భయానక ఆడిషన్ అనుభవాన్ని వెల్లడించారు.

Tollywood: ఆ దర్శకుడు ఇంటికొచ్చి నడుము చూపించమని అడిగాడు.. ఓపెన్‌గా చెప్పిన తెలుగు నటి
Mirchi Madhavi

Updated on: Dec 02, 2025 | 3:08 PM

నటి మిర్చి మాధవి ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులను, ముఖ్యంగా నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషణాత్మకంగా పంచుకున్నారు. ఒంటరి మూవీలో హీరో వదిన పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారని, ఆ తర్వాత మదర్ క్యారెక్టర్లు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నట్లు వివరించారు. తాను నటనపరంగా బిజీగా ఉన్నానని.. అయితే పరిశ్రమ ఇంకా మెరుగ్గా పని చేయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. నటీనటులు ఎదుర్కొంటున్న కష్టాలను మాధవి వివరించారు. సహాయ నటులకు సాధారణంగా సినిమా వైజ్ కాకుండా.. రోజువారీ చెల్లింపులు జరుగుతాయని ఆమె అన్నారు. పరిశ్రమలో యాక్టర్స్ ఎక్కవగా.. అవకాశాలు తక్కువగా ఉండటంతో… పారితోషికం పెంచమని అడిగితే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె వాపోయారు. తాను సాధారణ ఉద్యోగం చేసుకుని ఉంటే ఈపాటికి కోట్లు సంపాదించేదానినని, నటన తన అభిరుచి కాబట్టి ఈ రంగంలో కొనసాగుతున్నానని అన్నారు.

సీరియల్స్‌లో నటీమణులు ఎదుర్కొనే ఖర్చులను ఆమె స్పష్టంగా వివరించారు. సీరియల్స్‌కు అవసరమైన చీరలు, ఆభరణాలు, వాటి నిర్వహణ ఖర్చులన్నీ నటీమణులే భరించాల్సి వస్తుందని ఆమె తెలిపారు. ఒక సీరియల్ కోసం వందల చీరలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, సగటున ఒక్కో చీర రెండు వేల రూపాయలు అనుకుంటే, వంద చీరలకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. బ్లౌజులు కుట్టించుకోవడం, జ్యువెలరీ సెట్ చేసుకోవడం వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయని తెలిపారు. తాజాదనం కోసం తాను ప్రతి సీరియల్ ప్రారంభంలోనే దాదాపు 25 చీరలు కొనుగోలు చేస్తానని, ఒక నెల ఆదాయాన్ని దీనికి కేటాయిస్తానని ఆమె చెప్పారు. సీరియల్స్ సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగుతాయి కాబట్టి ఇది ఒక రకమైన పెట్టుబడిగా భావిస్తానని ఆమె అన్నారు.

కాస్టింగ్ కౌచ్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇది చాలా సంక్లిష్టమైన అంశమని మాధవి అన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒక మూసిన గదిలోకి వెళ్తే, అది వారి పరస్పర అంగీకారంతోనే జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఏమైనా కాంప్రమైజ్ జరిగి, ఆ తర్వాత పని జరగకపోతే, నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని, తరువాత దీని గురించి మాట్లాడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తన వరకు, అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, కానీ మేల్ డామినేషన్ వల్ల తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే జోకులు, వ్యాఖ్యలు ఎదుర్కొన్నానని ఆమె పంచుకున్నారు. తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనను మాధవి వెల్లడించారు. సుమారు 12-13 సంవత్సరాల క్రితం, ఒక దర్శకుడు తన ఇంటికి వచ్చి, తన ఆఫీసు ఇంకా రెడీ కాలేదని చెప్పి, తన ఇంటి వద్దే ఆడిషన్ చేస్తానని చెప్పాడని తెలిపారు. అప్పుడు ఆమె పంజాబీ డ్రెస్సులో ఉండగా, అటు ఇటు నడవమని, ఆ తర్వాత చీర కట్టుకుని రమ్మని అడిగాడని, చివరకు నడుము చూపించమని అసభ్యంగా కోరాడని చెప్పారు. దీంతో ఆగ్రహించిన మాధవి, ఆ దర్శకుడిని చెప్పుతో కొట్టి వెళ్లగొట్టానని, ఆ సంఘటన తనను తీవ్ర భయాందోళనలకు గురి చేసిందని అన్నారు. తన ఇంట్లో అప్పుడు తల్లి, పనిమనిషి మాత్రమే ఉన్నారని, ఆ ముగ్గురు మహిళలు ఎంత భయపడ్డారో వివరించారు. ఇలాంటి అనుభవాలు తనను తాను రక్షించుకోవడానికి మరింత ధైర్యాన్ని ఇచ్చాయని ఆమె అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .