తీవ్ర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బలగం సింగర్ మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరామర్శించారు. నిమ్స్‌కు వెళ్లిన ఎర్రబెల్లి.. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశాలిచ్చారు. కాగా మొగిలయ్య వైద్యానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని దయాకర్‌రావు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ నిమ్స్‌లో మొగిలయ్యను పరామర్శించారు. ఇక మొగిలయ్య ఆరోగ్య పరిస్థతిపై స్పందించిన వైద్యులు.. ప్రస్తుతం డయాలసిస్ సేవలను అందిస్తున్నామని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పుకొచ్చారు. కాగా కిడ్నీ సమస్యలతో బాధపడుతోన్న బలగం మొగిలయ్యకు ఇటీవల గుండె సంబంధిత సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో అధికారులు మొగిలయ్యను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా ‘బలగం’ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ‘తోడుగా మా తోడుండి’ పాటను మొగిలయ్య, కొమురమ్మ దంపతులు అద్భుతంగా ఆలపించి అందరితో కంటతడి పెట్టించారు. అయితే గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు మొగిలయ్య. ఈ మధ్యనే డయబెటిస్, బీపీ కూడా పెరగడంతో కంటి చూపు కూడా మందగించింది. గుండె నొప్పి కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం మొగిలయ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..